దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం

14 Dec, 2020 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు సోమవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం గ్రామ శివారులో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటన నిమిత్తం దత్తాత్రేయ ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. ముందు మూడు, వెనుక మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు మధ్యలో ఉంది. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో ఖైతాపురం గ్రామ శివారులోని టీఎన్‌ఆర్‌ వ్యూస్‌ పరిశ్రమ ముందుకు రాగానే దత్తాత్రేయ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే నుంచి ఎడమవైపునకు దూసుకెళ్లింది. అదే వేగంతో ముందున్న చెట్టును ఢీకొట్టి కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంతో దత్తాత్రేయ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని కాన్వాయ్‌లోని మరో వాహనంలో వెళ్లిపోయారు.  

కాపాడిన సీటు బెల్టు
దత్తాత్రేయ ప్రయాణిస్తున్న ఏపీ 09 ఏఎస్‌ 6666 నంబరుగల బుల్లెట్‌ప్రూఫ్‌ బెంజ్‌కారు ప్రమాదానికి గురైన సమయంలో వేగంగానే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. స్టీరింగ్‌ ఆకస్మాత్తుగా ఎడమవైపు లాగేయడంతో కారు అదుపు తప్పిందని డ్రైవర్‌ మురళి చెప్పారు. ముందు సీట్లో కూర్చున్న దత్తాత్రేయ సీటుబెల్టు ధరించారు. ఇది ఆయనను కాపాడింది. సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు కిందికి దూసుకెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో పల్టీలు కొట్టకుండా నేరుగా ముందుకు వెళ్లి ఆగిపోయింది. దాంతో పెను ప్రమాదం తప్పింది.  

దేవుడి ఆశీస్సులతోనే... 
దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలతోనే ప్రమాదం తప్పిందని దత్తాత్రేయ అన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ప్రమాదం విషయం తెలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్లు, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ, ఇతర ప్రముఖులు ఫోన్‌ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు