ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్‌ఐ.. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

22 Sep, 2022 03:32 IST|Sakshi

తెలంగాణలో విధ్వంసానికి కుట్ర

ఆ సంస్థ విస్తరణకు టీఆర్‌ఎస్సే కారణం

నాగోలు/లింగోజిగూడ: హిందువుల తలలు నరికి చంపుతున్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చెప్పారు. ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే ఆ సంస్థ పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పీఎఫ్‌ఐ విస్తరించడానికి టీఆర్‌ఎస్సే కారణమని, ఆ పార్టీ నేతలు కొంతమంది చందాలిచ్చి పెంచి పోషిస్తున్నారని అన్నారు.

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండికి.. నాగోలు చౌరస్తా వద్ద స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సత్కరించారు. గొర్రెపిల్లను బహూకరించారు. కాగా నాగోలు, కొత్తపేట డివిజన్‌ మోహన్‌నగర్, చైతన్యపురిలో ఆయన ప్రసంగించారు.  

సీఎంకు సోయి ఎందుకు లేదు?
పీఎఫ్‌ఐకి చెందిన సంస్థలపై ఎన్‌ఐఏ దాడులు చేసేంతవరకు సీఎం కేసీఆర్‌కు సోయి ఎందుకు లేదని సంజయ్‌ ప్రశ్నించారు. యూపీకి చెందిన ఓ ముఠా బిహార్‌లో బాంబులు తయారు చేసి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పేల్చేందుకు కుట్ర చేసిందని చెప్పారు. 2040 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్‌ఐ కుట్ర చేస్తోందని అన్నారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. 

క్వారంటైన్‌కు కేసీఆర్‌ కుటుంబం
ఏ స్కాం చూసినా కేసీఆర్‌ కుటుంబానిదే పాత్ర ఉంటోందని సంజయ్‌ అన్నారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న సీఎం.. లిక్కర్‌ స్కాంపై నోరెందుకు మెదపట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసి దేశ రాజకీయాలంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి ఆయన కుటుంబం క్వారంటైన్‌కు వెళుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌జీ తదితరులు పాల్గొన్నారు. 

నేటితో ముగియనున్న ‘బండి’ నాలుగో విడత యాత్ర

పెద్దఅంబర్‌పేటలో బహిరంగ సభ..  ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన నాలుగోవిడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగియనుంది. పెద్దఅంబర్‌పేట మున్సి పాలిటీలో నిర్వహిస్తున్న ముగింపు బహిరంగ సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బండి సంజయ్‌ గతేడాది ఆగస్టు 28న చార్మినార్‌ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతలుగా సాగింది. 4విడతల్లో 102 రోజుల పాటు 48 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 1,250కి.మీ. మేర యాత్ర సాగింది. 

భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభం..
బండి సంజయ్‌ మొదటివిడత పాదయాత్రను హైదరాబాద్‌ పాతబస్తీ భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభించారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్‌ మహానగరంలో, ఇతర చోట్ల వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. రెండో విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించారు.

మూడో విడతలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పరిధిలో యాత్ర సాగింది. మల్కాజ్‌గిరి లోక్‌సభస్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజ వకవర్గాలు, అలాగే ఇబ్రహీంపట్నం శాసనసభా నియోజక వర్గంలో సాగిన నాలుగో విడతలో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రోడ్లు, డ్రైనేజీలు, పరిశ్రమల కాలుష్యం, డంపింగ్‌ యార్డు.. వంటి సమస్యలపై గళం ఎత్తారు. 

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలు ఎండగట్టేందుకే మొగ్గు..
పాదయాత్ర సభల్లో బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా, జి.కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు, బండి సంజయ్‌ టీఆర్‌ఎస్‌ పాలనా వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రాధాన్యతనిచ్చారు. కేసీఆర్‌ హామీల అమల్లో వైఫల్యాలు, కేసీఆర్‌ కుటుంబ పాలన, నియంతృత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు.

కాగా, నెలలో 20 రోజుల పాటే పాదయాత్ర చేపట్టాలని, మిగతా పది రోజులు హైదరా బాద్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులను జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ మొత్తం 8 విడతల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదో విడత యాత్రను అక్టోబర్‌ 8–10 తేదీల మధ్య మొదలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు