ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలి 

15 Jan, 2022 02:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ బీసీ వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడంతో ప్రభుత్వం దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిపడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని  శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పీజీ కోర్సులకు మొత్తం ఫీజును ప్రభుత్వాలే చెల్లించేవని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పది వేల లోపు ర్యాంకు వచ్చినవారికి మాత్రమే ఫీజులు పూర్తిగా మంజూరు చేస్తూ ఆపై ర్యాంకు వచ్చిన వారికి రూ. 35 వేలు మాత్రమే చెల్లిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో మాదిరిగానే  పూర్తిగా ఫీజులు చెల్లించేలా జీవో నం.18ను సవరించాలని బండి సంజయ్‌ సూచించారు.       

మరిన్ని వార్తలు