కు.ని. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారమివ్వాలి: సంజయ్‌ 

2 Sep, 2022 01:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై చనిపోయిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ఇల్లు, పిల్లల చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. నలుగురు మహిళలు చనిపోయిన ఘటనకు బాధ్యుడైన ఆ శాఖ మంత్రి హరీశ్‌రావును వెంటనే బర్తరఫ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

హరీశ్‌ తమ కుటుంబసభ్యుడు కాబట్టే ఆయనపై సీఎం చర్యలు తీసుకోవడం లేదన్నారు. బుధవారం బాధితులను పరామర్శించిన అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందినా, మరో 30 మంది ఆసుపత్రులపాలైన కేసీఆర్‌ వారిని కనీసం పరామర్శించలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి ఇది నిదర్శనమని, ఇవి సర్కారీ హత్యలేనని ఆరోపించారు. ‘ఆపరేషన్‌ చేసేటప్పుడు కనీసం మత్తు ఇంజక్షన్‌ ఇయ్యలేదు. సర్జరీ చేస్తుంటే ఏడ్చినం.

ఆపరేషన్‌ అయినంక ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నం’అని బాధిత మహిళలు కన్నీటిపర్యంతమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఘోరం జరిగినా పట్టించుకోకుండా ఏమి ఉద్ధరించడానికి కేసీఆర్‌ బీహార్‌ వెళ్లారని ప్రశ్నించారు. ‘ఇక్కడి పైసలు తీసుకుపోయి బీహార్‌ల పెడతరా?’అని నిలదీశారు. ‘రోజులో 24 గంటలూ ఎవరి కొంపలు ముంచాలనే రాజకీయాలు చేయడమే తప్ప పేదల గురించి ఆలోచనే లేని దుర్మార్గుడు కేసీఆర్‌’అని మండిపడ్డారు. ‘హరీష్‌ రావు అబద్దాల మంత్రి. మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతల పనంతా నిత్యం లిక్కర్, ల్యాండ్, డ్రగ్స్, సాండ్‌ దందాలే’నని ఆరోపించారు. రికార్డు కోసం గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు