-

తెలంగాణ బీజేపీలో లుకలుకలు?..పొంగులేటి ఎపిసోడ్‌తో బట్టబయలు

4 May, 2023 12:36 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: తెలంగాణ బీజేపీలో ప్రధాన నేతల నడుమ లుకలుకలు బయటపడ్డాయా?. ఎవరికి వారే తమ ఆధిపత్యం ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారా?. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నడుమ గ్యాప్‌ నెలకొందనే విషయం తాజా పరిణామాలతో బయటపడింది. 

తెలంగాణ బీజేపీలో నేతల నడుమ ఆధిపత్య పోరు చాలాకాలంగా నడుస్తోంది. ఎవరి మార్క్‌ వాళ్లు చూపించాలనే తాపత్రయంలో.. ఎవరికి వారే అనే రీతి ప్రదర్శిస్తున్నారు. ఇది పార్టీ హైకమాండ్‌ దాకా వెళ్లడంతో.. నేతలంతా కలిసి వెళ్లాలని సూచించింది కూడా. అయినా కూడా తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతరం నడుస్తోంది.  

తాజాగా బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించే విషయమై బీజేపీ చేరికల కమిటీ సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం ఈటల బృందం ఆయన నివాసానికి వెళ్లనుంది.  ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఆరా తీయడానికి వెళ్లిన మీడియాకు ఆయన పెద్ద షాకే ఇచ్చారు. అసలు ఆ విషయమే తనకు తెలియదంటూ చెప్పారాయన. 

కరీంనగర్‌లో గురువారం కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో బీజేపీలోకి పొంగులేటిని ఆహ్వానించే విషయంపై మీడియా ఆయన్ని ఆరా తీసింది. అయితే పొంగులేటి దగ్గరకు ఈటల వెళ్లారనే సమాచారం తనకు తెలియదని ఆయన అన్నారు. ‘‘పొంగులేటి దగ్గరకు ఈటల వెళ్లారనే సమాచారం నాకు తెలియదు. నా దగ్గర ఫోన్‌ లేదు. అందుకే నాకు ఇప్పటిదాకా సమాచారం అందలేదు. కానీ, నాకు చెప్పకపోవడం తప్పేమీ కాదు కదా.  ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నాకు తెలిసినవారితో నేను మాట్లాడతా. ఈటెలకు తెలిసినవారితో ఆయన మాట్లాడతారు .. తప్పేంలేదు !’’ అంటూ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే బండి సంజయ్‌ను సంప్రదించకుండా పొంగులేటికి ఈటల ఎలాంటి హామీ ఇస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

పొంగులేటి బీజేపీ చేరికపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు .. పొంగులేటి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం. తెలంగాణ లో రాక్షస రాజ్యంపై పోరాడేందుకు ఎవరినైనా కలుపుకుపోతాం అని వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. గురువారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లనున్నారు. అదే సమయంలో పొంగులేటితో ఈటల నేతృత్వంలోని బీజేపీ చేరికల కమిటీ బృందం భేటీ కానుంది. ఇదే భేటీలో పొంగులేటితోపాటు జూపల్లిని సైతం బీజేపీలోకి ఆహ్వానించవచ్చనే ప్రచారం జోరందుకుంది. 

ఇదీ చదవండి: హస్తినలో బీఆర్‌ఎస్‌ అరుదైన ఘనత

మరిన్ని వార్తలు