24 నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర 

14 Aug, 2021 01:30 IST|Sakshi
భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మాట్లాడుతున్న రాజాసింగ్‌

‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా పేరు ఖరారు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటన

హుజూరాబాద్‌లో లబ్ధికోసమే దళితబంధు తెచ్చారని ధ్వజం

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌/దూద్‌బౌలి: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టనున్న పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’గా పేరును ఖరారు చేశారు. శుక్రవారం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ సీనియర్‌ నేతలతో కలసి ఎమ్మెల్యే రాజాసింగ్, పాదయాత్ర పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను చేపడుతున్నారని తెలిపారు.

పాదయాత్రను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, జనం సిద్ధంగా ఉన్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభమై హుజూరాబాద్‌ వరకు సాగుతుందని వెల్లడించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో లబ్ధిపొందడానికే సీఎం కేసీఆర్‌ దళితబంధు పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల సంక్షేమాన్ని కోరుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ పాతబస్తీని ఎంఐఎం నేతలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నీటిని మళ్లించుకుపోతున్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణ ఏడారిగా మారుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్‌ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. అనంతరం పాదయాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నేతలు చంద్రశేఖర్, స్వామిగౌడ్, బాబు మోహన్, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు