ఇంకా గృహ నిర్బంధంలోనే బండి సంజయ్‌.. హైకోర్టుకు బీజేపీ నేతలు

24 Aug, 2022 09:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్‌ ఘన్‌పూర్‌ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చింది. దీక్షలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా తన నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్‌. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది.

హైకోర్టుకు బీజేపీ
ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వీటితో పాటు ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు నేడు హైకోర్టుకు వెళ్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. తద్వారా యాత్ర కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు.

ఇదీ చదవండి: ఒక్కసారిగా హీటెక్కిన తెలంగాణ!   

మరిన్ని వార్తలు