‘ఫీజులుం’పై సీఎం మౌనం ఎందుకు?

1 Mar, 2021 04:37 IST|Sakshi

కార్పొరేట్‌ విద్యాసంస్థలు వేధింపులు మానకపోతే ప్రత్యక్ష కార్యాచరణ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆగడాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని, దాని వెనుక ఏం లాలూచీ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రైవేటు విద్యార్థుల తల్లిదండ్రులు బండి సంజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేవలం మూడు నెలల క్లాసులకు మొత్తం ఏడాది ఫీజు వసూలు చేయడం మానేయాలని కార్పొరేట్‌ కాలేజీలను హెచ్చరించారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధించడం మానకపోతే భారతీయ జనతా యువమోర్చా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్‌ సంస్థలు... టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

బండి సంజయ్‌తో బుడతడి సందడి
కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన బాలుడు నర్సింహ ఆదివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశాడు. ఇటీవల బాన్సువాడలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌ ప్రసంగిస్తుండగా నర్సింహ శ్రద్ధగా విని.. అనంతరం దానిపై స్పందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలైంది. దీంతో బాలుడిని బండి సంజయ్‌ ఆదివారం హైదరాబాద్‌కు పిలిపించి అతన్ని ఎత్తుకోవడంతో పాటు కలసి భోజనం చేశారు. కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకొని కొత్త దుస్తులు అందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, చదువుకయ్యే ఖర్చు భరిస్తామని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు