కు.ని ఆపరేషన్లపై మంత్రి హరీష్‌ సీరియస్‌.. డాక్టర్ల లైసెన్స్‌లు రద్దు!

31 Aug, 2022 14:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మహిళల మృతి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు పరామర్శించారు. మంత్రి హరీష్‌ రావు బుధవారం నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి బాధితులను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. ఆరేళ్లలో 12 లక్షల మందికి ఆపరేషన్లు చేశాం. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ ఆపరేషన్లు చేసిన డాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేశాము. ఈ ఘటనపై కమిటీ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాము అని స్పష్టం చేశారు. 

మరోవైపు.. ఇబ్రహీంపట్నం ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సైతం స్పందించారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గంటలో 34 మందికి ఎవరైనా ఆపరేషన్లు చేస్తారా.? ఇలా మహిళల ప్రాణాలతో ఆటుకుంటారా?. టెస్టులు చేయకుండా, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోకుండా ఇలా కు.ని ఆపరేషన్లు చేస్తారా?. వారిని ఆసుపత్రి గదిలో కింద పడుకోపెట్టి అంత తొందరగా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, అపోలో ఆసుపత్రిలో 11 మంది, నిమ్స్‌లో 19 మంది చికిత్స పొందుతున్నారు. 

ఇది కూడా చదవండి: కు.ని.ఆపరేషన్‌పై భయాందోళనలు.. వ్యాసెక్టమీతో పురుషులకు వచ్చే ఇబ్బందులేంటి?

మరిన్ని వార్తలు