ముదురుతున్న మునుగోడు పాలిటిక్స్‌.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

24 Oct, 2022 14:51 IST|Sakshi

సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుండి పొలిటికల్‌ లీడర్ల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు కూడా దారి తీస్తోంది. మూడు పార్టీల నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కాగా, బండి సంజయ్‌ తాజాగా ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ‘మునుగోడులో దొడ్దిదారిన గెలవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలు చేస్తోంది. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. టీఆర్‌ఎస్‌ వైఖరిని మునుగోడు ప్రజలు గమినిస్తున్నారు. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నిక. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. కేసీఆర్‌ అహం దిగాలంటే టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్‌ మండలం జైకేసారం మండలంలో ఆదివారం బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య  ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకుముందు కూడా.. నాంపల్లి మండలంలో తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరిన్ని వార్తలు