‘తప్పు చేసినోళ్లకు నోటీసులెందుకు ఇవ్వరు?’: బండి సంజయ్‌

25 Mar, 2023 15:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణలో అన్నీ స్కామ్‌లే అని, లక్షల మంది నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారని, టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్‌ బండి సంజయ్‌. ఇందిరాపార్క్‌  ధర్నాచౌక్‌ వద్ద శనివారం బీజేపీ చేపట్టిన మహా ధర్నాలో ఆయన ప్రసంగించారు. 

తప్పు చేసిన టీఎస్‌పీఎస్సీని ఎందుకు రద్దు చేయరు. ఆ కమిషన్‌ చైర్మన్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వరు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్షాలకు నోటీసులు ఇస్తున్నారు.  టీఎస్‌పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్‌ చేయాలి. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి అని బండి సంజయ్‌ మహాధర్నా సాక్షిగా డిమాండ్‌ చేశారాయన. తెలంగాణలో అన్నీ స్కామ్‌లేనన్న బండి సంజయ్‌.. పేపర్‌ లీకేజీ కేసులో ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన.

మంత్రి కేటీఆర్‌ నిర్వాహకమే దీనికి కారణమని ఆరోపించిన బండి సంజయ్‌.. కేటీఆర్‌ రాజీనామా చేయాల్సిందేనని, లేకుంటే ఆయన్ని పదవి నుంచి దించి తీరతామని శపథం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నారని మండిపడ్డ బీజేపీ చీఫ్‌..  ముప్ఫై లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ.. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం​ చేసి తీరతామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు