అవి గుంట నక్కల పార్టీలు

28 Apr, 2022 08:15 IST|Sakshi
ఊట్కూర్‌లో బండి సంజయ్‌ పాదయాత్ర 

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలపై 

బండి సంజయ్‌ విమర్శలు 

ఊట్కూర్‌ ప్రజలకు అండగా నిలుస్తామని హామీ

రాష్ట్రానికి 5న నడ్డా, 14న అమిత్‌ షా వస్తున్నారని వెల్లడి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘ఊట్కూర్‌ ప్రజలారా మీరంతా తెలంగాణ అంతటా తిరగండి. హిందువులకు జరిగిన అన్యాయాన్ని వివరించి అందరినీ ఏకం చేయండి. బీజేపీ అధికారంలోకి వచ్చాక పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం, భైంసా, ఊట్కూర్‌ ప్రాంతాలను నేను దత్తత తీసుకుంటా. గాయపడ్డ తమ్ముళ్లకు ఉద్యోగాలిప్పించే బాధ్యత తీసుకుంటా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర బుధవారం మక్తల్‌ నియోజకవర్గంలో కొనసాగింది.

రాత్రి ఊట్కూర్‌లో సంజయ్‌ మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో ఊట్కూర్, భైంసా తమ్ముళ్ల వీరోచిత పోరాటాలు నిలిచిపోయేలా చేస్తామన్నారు. తెలంగాణ సమాజమంతా ఊట్కూర్‌ హిందువులకు జరిగిన అన్యాయాన్ని వినాలని, సెప్టెంబర్‌ 3ను బ్లాక్‌ డేగా ప్రకటిస్తున్నానని.. అధికారంలోకి వచ్చాక విజయోత్సవ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు.

నిజాం కాలంలో రజాకార్లు చేసిన అరాచకాలకు మించి.. కేసీఆర్‌ పాలనలో పోలీసులు ఊట్కూర్‌ హిందువులను, మహిళలను చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గణేశ్‌ ఉత్సవాలు చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? అని మండిపడ్డారు. ‘బీజేపీని ఎదుర్కొనే దమ్ములేక కేసీఆర్‌ కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్కక్కైండు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ గుంట నక్కల పార్టీలు.

మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ సింహంలా సింగిల్‌గానే పోటీ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం’ అని చెప్పారు. ఊట్కూర్‌ అభివృద్ధి కోసం తన ఎంపీ లాడ్స్‌నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నానని, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు సైతం ఎంపీ లాడ్స్‌ నుంచి మరో రూ.5 లక్షలు ప్రకటించారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వచ్చే నెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 14న హోంమంత్రి అమిత్‌ షా వస్తున్నారని చెప్పారు. 

బండి లేఖాస్త్రం
‘కేసీఆర్‌ సారూ.. మీ పార్టీ ఘనంగా జరుపుకొంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా ప్రజల తరఫున మేము అడిగే 21 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి’.. అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామయాత్ర నుంచి లేఖ సంధించారు. సమాధానాలు దాటవేస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా ఒప్పుకుని.. ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు