రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన: బండి సంజయ్‌

26 Feb, 2021 03:31 IST|Sakshi

బాన్సువాడలో ప్రభుత్వంపై బండి సంజయ్‌ విసుర్లు

జైళ్లకు వెళ్లడానికైనా సిద్ధం.. బడ్జెట్‌లో లాఠీలు, జైళ్లకు నిధులు పెంచుకోండి 

పోచారం కుమారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు

సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో లాఠీలు, జైళ్ల కోసం నిధులు కేటాయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులుపెట్టి లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని, తూటాలకు భయపడబోమని, ఎంతమందిని అరెస్టుచేసి జైళ్లకు పంపినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో బండి సంజయ్‌ మాట్లాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రాణాలివ్వడానికీ వెనుకాడరని, ఇందుకు కామారెడ్డి జిల్లాలో రేవూరి సురేందర్‌ నిదర్శనమన్నారు. నక్సలైట్లు సురేందర్‌ను పొట్టన పెట్టుకున్నా బీజేపీ కార్యకర్తలు ఏనాడూ భయపడలేదన్నారు.

రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన నడుస్తోందన్నారు. తెలంగాణను దోచుకుంటున్న దొంగలను కూడా అరెస్టుచేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. రాష్ట్రంలో ధోకేబాజి, బట్టేబాజి పాలన నడుస్తోందని సంజయ్‌ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకొంటున్న పోడు భూముల సమస్యను వారంలో పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి.. గుర్రంపోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్‌ఎస్‌ నాయకులు ఆక్రమించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని సంజయ్‌ ధ్వజమెత్తారు. బాన్సువాడ ఛత్రునాయక్‌ తండాలో రైతుల పంటలను అటవీ అధికారులతో దున్నించారని, గిరిజనులకు ఈ ప్రభుత్వం చేస్తున్న మేలు ఏపాటిదో ఇది రుజువు చేస్తుందన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఉద్దేశించి.. టీడీపీ, టీఆర్‌ఎస్‌ హయాంలలో ఆయన మంత్రి పదవి పోవడానికి కారణాలేంటో రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసని సంజయ్‌ అన్నారు.

పోచారం కుమారులు బాన్సువాడలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తాము నిజామాబాద్‌ నుంచి సభకు వస్తుంటే పోలీసులు రక్షణ కల్పించలేదని, అదే పోచారం కుమారుల వెంట కాన్వాయ్‌లు నడుపుతున్నారని ఆరోపించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడుతూ బాన్సువాడకు పట్టిన గబ్బిలాలను పారదోలే అవకాశం వచ్చిందన్నారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బీజేపీలో చేరగా, వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, అరుణతార, యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు