ఆటంకాలు సృష్టిస్తే ప్రగతిభవన్‌లోనే నిమజ్జనాలు: బండి సంజయ్‌

6 Sep, 2022 01:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఖైరతాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో ప్రగతిభవన్‌ వేదికగా గణేశ్‌ నిమజ్జనం నిర్వహించాల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. వినాయక నిమజ్జనాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వు లను ఉల్లంఘించే సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి నిమజ్జనానికి ఆటంకాలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌తోపాటు మరికొందరు నేతలతో కలసి సోమవారం ఆయన ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 25 కిలోల లడ్డూ ప్రసాదాన్ని బండి సంజయ్‌ నెత్తిన పెట్టుకొని కొద్దిదూరం నడిచి వెళ్లి మహాగణపతికి సమర్పించారు.

అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ‘ఏటా వినాయక నిమజ్జనాలు ఉద్రిక్త వాతావరణంలో జరుపుకునే దుస్థితి టీఆర్‌ఎస్‌ పాలనలో ఏర్పడింది. ఈ ఉత్సవాలు జరుపుకునేందుకు అన్ని అనుమతులు తీసుకున్నాక కూడా ప్రభుత్వం నిమజ్జనాలకు ఆటంకాలు సృష్టిస్తోంది. ఏటా గణేశ్‌ మండపాల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. హిందువుల పండుగలంటేనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశంగా మారుస్తోంది’ అని ఆరోపించారు. కోవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు సైతం పాతబస్తీలో రంజాన్‌ సందర్భంగా ముస్లింలు ర్యాలీలు చేపట్టారని.. బాదం, పిస్తాలు పంచినా తాము అడ్డుకోలేదని చెప్పారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా ప్రభుత్వం నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోబోమని.. ట్యాంక్‌బండ్‌ వద్ద ఎలా నిమజ్జనం చేసుకోవాలో తమకు తెలుసన్నారు. సమాజమంతా బాగుండాలని కోరుకునే వాడే నిజ మైన హిందువని, హిందువులంతా సంఘటితం కావాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. కాగా, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన పలువురు హోంగార్డులు సంజయ్‌ను కలసి వినతిపత్రం ఇచ్చారు. హైకోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలిచ్చినా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా రు. ఇందుకు సంజయ్‌ స్పందిస్తూ కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగిస్తేనే హోంగార్డులతోపాటు ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

ఇదీ చదవండి: ఖైరతాబాద్‌ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట

మరిన్ని వార్తలు