బూజు జాడ చెప్పే కొత్త యంత్రం!

28 Oct, 2020 08:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అభివృద్ధి చేసిన ప్యూర్‌ స్కాన్‌ ఎ.ఐ.

ఇక్రిశాట్, సీజీఏఐఆర్‌ ఇన్‌స్పైర్‌ చాలెంజ్‌ అవార్డు

బూజుతో కేన్సర్‌ సహా అనేక ఆరోగ్య సమస్యలు

సాక్షి, హైదరాబాద్‌: బూజు పట్టిన ఆహారం తింటే ఏమవుతుంది? పలుమార్లు బాత్రూంకు వెళ్లాల్సి రావడం తాత్కాలిక ప్రతి క్రియ కానీ.. తరచూ తిన్నా.. కాలేయం పాడైపోయి ప్రాణాల మీదకు వస్తుందని సైన్స్‌ చెబుతోంది. బూజులోని అఫ్లాటాక్సిన్లనే విషరసాయనాల వల్ల కొన్నిసార్లు కేన్సర్‌ బారిన కూడా పడొచ్చు. బూజు లేని ఆహారాన్ని మాత్రమే తినడం ఈ సమస్యలకు పరిష్కారం. కానీ అఫ్లాటాక్సిన్లను గుర్తించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పరిశోధనశాలల్లో మాత్రమే వీలయ్యే పని. మరి తరుణోపాయం ఏంటంటే.. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్యూర్‌ స్కాన్‌ ఎ.ఐ.’అనే స్టార్టప్‌ పరిశోధనల పుణ్యమా అని అఫ్లాటాక్సిన్లను గుర్తించేందుకు సరికొత్త యంత్రం అందుబాటులోకి వచ్చింది.

5 అంగుళాల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పరికరం అతినీలలోహిత కిరణాల సాయంతో అఫ్లాటాక్సిన్లను గుర్తిస్తుంది. అర నిమిషంలోనే మోతాదును కూడా నిర్ధారిస్తుంది. అఫ్లాటాక్సిన్లు అతినీల లోహిత కిరణాల కాంతిలో ప్రతిదీప్తిని ఇస్తాయి. పరిశీలించాల్సిన ఆహార పదార్థపు ఫొటో లు తీసి వాటిల్లో ప్రతిదీప్తిని ఇస్తున్న ప్రాంతాలను గుర్తించడం.. మెషీన్‌ లర్నింగ్‌ పద్ధతుల సాయంతో అఫ్లాటాక్సిన్ల మోతాదును గుర్తించడం ఈ పరికరం పనిచేసే పద్ధతి. తక్కువ ధరకే దొరికే ఈ యంత్రం అత్యంత కచ్చితత్వంతో పని చేస్తుంది కూడా.

ఇన్‌స్పైర్‌ చాలెంజ్‌ అవార్డు..
రైతులు, వ్యవసాయం ఎదుర్కొంటు న్న పలు సమస్యలకు బిగ్‌ డేటా సా యంతో పరిష్కారాలు కనుగొనేందు కు అంతర్జాతీయ మెట్ట ప్రాంత పం టల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌), సీజీఏఐఆర్‌లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇన్‌స్పైర్‌ చాలెంజ్‌ అవార్డుకు ప్యూర్‌ స్కాన్‌ ఎ.ఐ. అభివృద్ధి చేసిన యంత్రం ఎంపికైంది. అవార్డులో భాగంగా దాదాపు రూ.73.63 లక్షలు (లక్ష డాలర్లు) నగదు ఈ కంపెనీకి దక్కనుంది. 

రైతులకు లాభం
అఫ్లాటాక్సిన్లను గుర్తించే పరికరం అందుబాటులో ఉంటే రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పంట దిగుబడులు వచ్చాక పలు కారణాల వల్ల వాటిల్లో ఈ అఫ్లాటాక్సిన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది కాస్తా ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. అఫ్లాటాక్సిన్లను గుర్తించే యంత్రంతో రైతులు విషాలు తక్కువగా ఉన్నవాటిని పొలంలోనే వేరు చేయొచ్చు. దీంతో వారు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర పొందొచ్చు. ప్యూర్‌ స్కాన్‌ ఎ.ఐ. తయారు చేసిన యంత్రంపై మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఖరీఫ్‌ నాటికి ఈ యంత్రం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. – డాక్టర్‌ శ్రీకాంత్, ఇక్రిశాట్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు