డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌: బయటపడ్డ వాస్తవాలు.. పేరుకే ప్రిన్సిపాల్‌.. పెత్తనమంతా డ్రైవర్‌దే 

28 Oct, 2022 12:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌– 14లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌కు బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న స్కూల్‌లో పని చేస్తున్న డ్రైవర్‌ రజనీకుమార్‌ నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధిత చిన్నారి వయసు ధ్రువీకరణ పత్రాలతోపాటు అడ్మిషన్‌ ఎప్పుడు పొందింది? తదితర వివరాలతో కూడిన పత్రాలను పోలీస్‌ స్టేషన్లో అందించాల్సిందిగా సూచిస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు. డీఏవీ స్కూల్‌లో పనిచేస్తున్న పరిపాలన సిబ్బంది, టీచర్లు ఈ నెల 25 నుంచి సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్‌లో హాజరవుతున్నారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని డీఏవీ స్కూల్‌ అనుమతులు రద్దు చేయడంతో ఈ స్కూల్‌కు చెందిన సిబ్బంది, టీచర్లు తమ హాజరును సఫిల్‌గూడ డీఏవీ స్కూల్‌లో వేయిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న బంజారాహిల్స్‌ స్కూల్‌ను బుధవారం డీఏవీ స్కూల్‌ డైరెక్టర్‌ నిషా తనిఖీలు చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. పాఠశాలలో 30 సీసీ కెమెరాలు ఉండగా అందులో వీరు చేసిన తనిఖీల్లో 12 కెమెరాలు పని చేస్తున్నట్లు తేలింది. చాలా కెమెరాలకు వైర్లు తెగి పడి ఉండటాన్ని గుర్తించారు. ఇదేమిటని ఆరా తీయగా వీటి నిర్వహణ మొత్తం అత్యాచార నిందితుడు రజనీకుమార్‌దేనని సిబ్బంది ఆమె దృష్టికి తీసుకొచ్చారు.

సీసీ కెమెరా నిర్వహణ మొత్తం తన చేతుల్లోనే ఉంచుకున్నాడని ఆరోపించారు. స్కూల్‌లో ఏ కార్యక్రమం జరగాలన్నా పెత్తనమంతా రజనీకుమార్‌దేనని సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పేరుకు మాత్రమే ప్రిన్సిపాల్‌ ఉండగా పెత్తనమంతా రజనీకుమార్‌దేనని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. బాత్‌రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పని చేయడం లేదని తనిఖీల్లో తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజుల్లో స్కూల్‌ ప్రారంభం కానుండగా ఇక్కడ మార్పులు చేయాల్సిన అవసరముందని గుర్తించారు.  
చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు

మరిన్ని వార్తలు