Banjara Hills: కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్‌ లాక్కొని ఉడాయింపు.. ట్విస్ట్‌ ఏంటంటే!

24 Nov, 2022 11:55 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ముసుగు ధరించి నంబర్‌ ప్లేట్‌ లేని బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు వజ్రాల వ్యాపారి వద్ద పని చేసే వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి, అతడి చేతిలో ఉన్న బ్యాగ్‌ లాక్కొని పరారయ్యారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్‌ యజమాని అంకిత్‌ అగర్వాల్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో నివాసం ఉంటున్నాడు.

ఇతడి వద్ద పని చేసే సేల్స్‌మెన్‌ ఆనంద్‌ మంగళవారం రాత్రి 9 గంటలకు ఆభరణాల దుకాణాన్ని మూసివేశాడు. రెండు షట్టర్లు, లాకర్ల తాళం చెవులు బ్యాగ్‌లో వేసుకొని యజమానికి ఇవ్వడానికి స్కూటీపై అతని నివాసానికి వచ్చాడు. హెల్మెట్‌ తీసి తన వాహనంపై పెడుతుండగా అప్పటికే పంజగుట్ట నుంచి అనుసరిస్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆనంద్‌ కళ్లల్లో కారం కొట్టి బ్యాగు లాక్కొని ఉడాయించారు. రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు జూబ్లీహిల్స్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా, అదే రోజు రాత్రి ఆగంతకులు ఆ బ్యాగును పంజగుట్టలోని కృష్ణా జ్యువెలర్స్‌ ముందు పడేసి పరారైనట్లుగా గుర్తించారు. ఈ బ్యాగులో డబ్బు లేదా నగలు ఉంటాయని వారు భావించి ఉంటారని, అందులో తాళం చెవులు మాత్రమే ఉండటంతో బ్యాగు ను షాపు వద్ద పడేసి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా తాళాలతో షాపు షట్టర్లు తెరుద్దామని వెళ్లి ఉంటారని,అయితే, అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండటంతో బ్యాగ్‌ను షాపు ముందు పడేసి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అగంతకుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు