Banjara Hills: ఉద్రిక్త వాతావరణం నడుమ తెరుచుకున్న డీఏవీ స్కూల్‌

4 Nov, 2022 11:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.14లోని బాదం సరోజా దేవి డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ రెండు వారాల అనంతరం గురువారం ఉద్రిక్త వాతావరణం నడుమ తెరుచుకుంది. గత నెల 18వ తేదీన స్కూల్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్న రజనీకుమార్‌ నాలుగున్నరేళ్ల ఎల్‌కేజీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులతో ఆపటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అప్పటి నుంచి స్కూల్‌ను మూసివేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు విద్యాశాఖ అధికారులు స్కూల్‌ రీఓపెన్‌కు అనుమతులిచ్చారు.


డీఏవీ స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు  

అయితే తమకు న్యాయం జరగకుండానే స్కూల్‌ను ఎలా తెరుస్తారంటూ గురువారం ఉదయం బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని సముదాయించి అక్కడి నుంచి తరలించారు. సుమారు గంటపాటు బాధిత చిన్నారి తల్లిదండ్రులు అక్కడే బైఠాయించారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా, న్యాయం చేయకుండా తెరవడం అన్యాయమంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని తమ పిల్లల భవిష్యత్‌ను పాడుచేయవద్దంటూ వేడుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బంజారాహిల్స్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఏమవుతుందోనన్న బెంగతో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్‌ వద్దే కాపుకాశారు. మొదటి రోజున 98 శాతం హాజరు నమోదైంది. పాఠశాలలో గుర్తించిన 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు ప్రయత్నాలు 
డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో గత నెల 18వ తేదీన నాలుగున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్‌ రజనీకుమార్, నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జి హెచ్‌ఎం మాధవిలను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా ఈ ఘటనపై సత్వర న్యాయం జరిగే విధంగా ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటు కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. మరో పది రోజుల్లో  నిందితుల చార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

చార్జిషీట్‌ దాఖలు కాగానే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరిగే విధంగా పోలీసులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి పకడ్బందీ శాస్త్రీయ ఆధారాలను ప్రవేశ పెట్టడం ద్వారా నిందితులకు తగిన శిక్ష పడే విధంగా చార్జిషీట్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే బాధిత బాలిక వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఈ కేసులో బాధితురాలు వాంగ్మూలం కీలకం కానుంది.  

మరిన్ని వార్తలు