సైబర్‌ నేరస్తులతో బ్యాంకర్ల దోస్తీ.. ఒక్కో ఖాతా రూ.30 వేలకు..

4 Aug, 2022 12:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నగరానికి చెందిన ఓ బాధితురాలు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌ మోసానికి గురైంది. తన అకౌంట్‌లోని సొమ్ము మాయం కాగానే ఆలస్యం చేయకుండా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సంబంధిత బ్యాంక్‌ ఖాతాను ఫ్రీజ్‌ చేయాలని పోలీసులు బ్యాంకు నోడల్‌ ఏజెన్సీకి సూచించారు. అయినా సైబర్‌ నేరస్తుడు బాధితురాలి అకౌంట్‌లోని సొమ్మును స్వాహా చేసేశాడు’.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్‌ అధికారులు కావాలనే అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేయడంలో ఆలస్యం చేశారన్న విషయం తెలిసి షాక్‌ గురయ్యారు. సైబర్‌ నేరస్తులు బ్యాంక్‌ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, కొట్టేసిన సొమ్ములో వారికీ కమీషన్లు ఇస్తున్నారన్న నిజాలు తెలిసి విస్తుపోయారు. 

ఝార్ఖండ్, బిహార్‌ తదితర రాష్ట్రాల్లోని పలు బ్యాంక్‌లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్మిని స్ట్రేటర్లు, బ్యాంకర్లు అందరూ నేరస్తులకు సహకరిస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒకరు తెలిపారు. జీరో అకౌంట్లయిన జన్‌ధన్‌ ఖాతాల్లో రోజుకు రూ.లక్ష, రూ.2 లక్షల లావాదేవీలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి దృష్టికి తేవాలి. అధికారులు వాటిని పట్టించుకోకుండా... నేరస్తులకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు.  
చదవండి: మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నారాజ్‌! 

మ్యూల్‌ అకౌంట్లలోనే లావాదేవీలు.. 
నిరక్షరాస్యులు, పేదల గుర్తింపు కార్డులతో ఏజెంట్లు నకిలీ(మ్యూల్‌) అకౌంట్లను తెరిచి, పాస్‌బుక్, చెక్‌బుక్, డెబిట్‌ కార్డ్, ఫోన్‌ బ్యాంక్‌ కిట్‌ మొత్తాన్ని నేరస్తులకు అందజేస్తుంటారు. ఒక్కో ఖాతాకు రూ.25–30 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ బినామీ అకౌంట్లలోనే సైబర్‌ మోసాల లావాదేవీలను నిర్వహిస్తున్నారు.  

గుజరాత్, బెంగాల్‌ వంటి రాష్ట్రాల నుంచి మ్యూల్‌ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి తాలూకు లావాదేవీలు మాత్రం బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి చేస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఖాతాదారుల చిరునామాలను ధ్రువీకరించిన తర్వాతే బ్యాంకులు అకౌంట్లను తెరవాలి. లేకపోతే వారి మీద కూడా ఐపీసీ 109 అబాట్‌మెంట్‌ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

రాచకొండ సైబర్‌ క్రైమ్‌లో నమోదయిన ఓ కేసులో బాధితుడి నుంచి కొట్టేసిన రూ.60 లక్షల సొమ్మును నేరస్తులు అసోంకు చెందిన ఒక ఓలా డ్రైవర్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశారు. ఆ డ్రైవర్‌ నగదును విత్‌డ్రా చేసి నేరస్తులకు అందించాడు. ఖాతాదారుకు ఆ లావాదేవీ మోసపూరితమైనదని తెలిసినా నేరస్తుడికి సహకరించిన నేపథ్యంలో పోలీసులు ఆ డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు