TS: మొండిచెయ్యి.. సగం రుణాలూ ఇవ్వలేదు..

5 Oct, 2021 02:34 IST|Sakshi

రైతులకు బ్యాంకుల మొండిచెయ్యి

వానాకాలం సీజన్‌లో సాధారణ విస్తీర్ణాన్ని మించి పంటల సాగు

సాగుకనుగుణంగా మంజూరు కాని రుణాలు

రూ. 35,665 కోట్ల లక్ష్యం... ఇచ్చింది రూ.15,500 కోట్లే

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ లక్ష్యంలో సగం రుణాలు కూడా ఇవ్వకపోడం విచారకరం. ఈ సీజన్‌లో రూ.35,665 కోట్లు ఇవ్వా లనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 15,500 వేల కోట్ల మేరకే రుణాలు మంజూరు అయ్యాయి. వాస్తవానికి సీజన్‌ ప్రారంభానికి ముందుగానే రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి.

ఆ ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాలి. కానీ రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ఐదు రోజుల క్రితం ముగిసింది. పంటల సాగు 111 శాతం ఉండగా రుణాల మంజూరు మాత్రం మరీ నిరాశాజనకంగా ఉంది.

1.19 కోట్ల ఎకరాల్లో సాగు 
రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండు మూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైంది. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. అయితే వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ పంటలకు కూడా రుణాలు ఆ స్థాయిలో అందలేదు.

(2021–22కు సంబంధించిన మొత్తాలు వానాకాలం సీజన్‌వే) 

రూ. 5 వేల కోట్ల ప్రైవేట్‌ అప్పులు! 
2021–22 రెండు సీజన్లలో రూ. 59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో ఈ సీజన్‌కు రూ. 35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు అందులో 43.45% మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల తీరు కారణంగానే రైతులు రుణాలు పొందలేక పోయారనే విమర్శలున్నాయి. కొద్దిపాటి రుణాలు తీసుకోవడానికి రైతులు ఎలాం టి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పా సు పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇచ్చా యి.  నిస్సహాయ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారు. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్‌ అప్పులు చేసినట్లు అంచనా. మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్‌ రుణాలు తప్ప మరో ఆధారం లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఏడాదికేడాదికీ తగ్గుతున్న రుణాలు 
2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయి. అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నాయి.  

మరిన్ని వార్తలు