Basar: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు

31 May, 2021 09:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ కోటలోకి అడుగుపెడితే.. కళ్లు చెదిరే శిల్పకళ మన కళ్లముందు కదలాడుతుంది. అలాంటి శిల్పాలెన్నో ముస్లిం రాజుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. తెలంగాణ నలుమూలలా నాటి విధ్వంసాలకు మూగ సాక్ష్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. దాడుల నుంచి ప్రజలు తప్పించుకుని పొలాల్లోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకునేవారు. కొంతమంది అపురూప శిల్ప సంపదనూ మట్టిదిబ్బల కింద దాచి కాపాడుకున్నారు. అలా దాచినట్టుగా భావిస్తున్న కొన్ని శిల్పా లు తాజాగా వెలుగు చూశాయి. 

అప్పుడు శివలింగం.. ఇప్పుడు అరుదైన విగ్రహాలు 
నిర్మల్‌ జిల్లా బాసరకు అతి చేరువలో ఉన్న మైలా పూర్‌లో తాజాగా కొన్ని విగ్రహాలు వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్‌కు చెందిన పొలం లోని బావి పక్కన ముళ్ల పొదలను తొలగిస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గతంలో ఇక్కడ ఓ శివలింగం వెలుగుచూడగా స్థానికులు దానికి పూజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అరుదైన భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహం, రెండు అమ్మదేవతల విగ్రహాలు, ఓ అయ్యదేవర శిల్పం బయటపడ్డాయి.

ఇవి 11వ శతాబ్దం మొదలు 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. అప్పట్లో ముస్లిం పాలకుల సైన్యంతోపాటు రోహిల్లా తెగకు చెందినవారు కూడా ఈ ప్రాంతాలపై దాడులు చేసేవారు. స్థానికుడైన మక్కాజీ పటేల్‌ ప్రజలతోపాటు శిల్ప సంపదను కూడా దాచి కాపాడాడని స్థానికుల కథనం. ఈ విగ్రహాలు కూడా ఆయన దాచినవే అయి ఉంటాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి కొంత దూరంలో కొన్ని శిథిల దేవాలయాలున్నాయని, దేవాలయ స్తంభాలతో నిర్మించిన ఓ అషూర్‌ఖానా కూడా అక్కడ ఉందన్నారు.

బుద్ధుడి భంగిమే ప్రత్యేకం.. 
బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయమైందన్న మాటలను అనుమానిస్తూ అందుకు సాక్ష్యమేంటని కొందరు ప్రశ్నించిన సమయంలో ‘భూమే’సాక్ష్యం అని బుద్ధుడు చూపాడని చెబుతారు. అలా భూమిని చూపే ముద్రలో ఉన్న బుద్ధుడి శిల్పం ఇక్కడ వెలుగుచూసిందని హరగోపాల్‌ పేర్కొన్నారు. చదువుల తల్లి సరస్వతి క్షేత్రమే బాసర అయినందున ‘విద్యాశరణ సంపన్నుడై’న బుద్ధుడి విగ్రహాన్ని అప్పట్లో స్థానికంగా ఏర్పాటు చేసుకుని ఆరాధించి ఉంటారని చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారని చెప్పారు. అయ్యదేవర విగ్రహం మైలారదేవుడిదని, విశ్వకర్మ వర్గానికి చెందినవారు కొలిచే మమ్మాయి దేవత ప్రతిరూపాలు కూడా రెండున్నాయన్నారు.

ఇనుముకు ప్రతిరూపంగా ఈ దేవతను కొలుస్తారని, పక్కనే సూదులమ్మ గుడి ఉన్నందున.. సూదులంటే ఇనుముకు గుర్తే అయినందున ఇవి మమ్మాయి దేవతలే అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఖండేరాయుని జాగ అని పిలుస్తారని, మైలారదేవుడిని తెలంగాణ ప్రాంతంలో మల్లన్న అని, కొన్ని ఇతర ప్రాంతాల్లో ఖండోబా అని పిలుస్తారని, ఆ ఖండోబా పేరుతోనే ఈ ప్రాంతానికి ఖండేరాయుని జాగా అని పేరు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విగ్రహాలకు వేదిక నిర్మించనున్నట్టు తెలిపారు. 
చదవండి: హ్యాట్సాఫ్‌ ఎస్‌ఐ: గోడెక్కిన చదువు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు