అమ్మా.. నన్ను క్షమించు.. అక్కను బాగా చూసుకో..

20 Dec, 2022 02:05 IST|Sakshi

సూసైడ్‌ నోట్‌లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి భానుప్రసాద్‌ 

ట్రిపుల్‌ ఐటీ, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత 

బాసర(ముథోల్‌): ‘అమ్మా నన్ను క్షమించు.. అక్కను బాగాచూసుకో.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా మానసిక సమస్యలే నా చావుకు కారణం’అని బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ–2 విద్యార్థి భానుప్రసాద్‌ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఆదివారం మధ్యాహ్నం భానుప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం బహిర్గతమైన ఈ సూసైడ్‌ నోట్‌లో తాను ఓసీడీ(అనవసరపు భయాందోళన)తో తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు వెల్లడించాడు.

గతంలో ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నానని, చదువుపై «శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, పరీక్షల్లో మార్కులు సరిగా రావడం లేదని వివరించాడు. విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం, రహస్యంగా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించడంపై ఆదివారం రాత్రి విద్యార్థులు ఆందోళన చేశారు. అడ్మిని్రస్టేటివ్‌ బిల్డింగ్‌ ఎదుట బైఠాయించారు. సూసైడ్‌నోట్‌ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. నోట్‌ బహిర్గతం చేయడంతో ఆందోళన విరమించారు.

కాగా, వర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ సోమవారం విద్యార్థి సంఘాలతోపాటు, బీజేపీ, ఆప్‌ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టడంతో ట్రిపుల్‌ ఐటీ, జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు వర్సిటీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు