బాసరలో జాగ‘రణం’

20 Jun, 2022 02:20 IST|Sakshi
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలోనూ ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులు

రాత్రిపూటా విద్యార్థుల ఆందోళన

సీఎం లేదంటే కేటీఆర్‌ రావాల్సిందే..

పట్టువీడని తీరు.. ఆరోరోజూ పోరు

అర్ధరాత్రి చర్చలకు వచ్చిన కలెక్టర్‌

కొనసాగుతున్న ప్రతిష్టంభన

నిర్మల్‌/బాసర: ఎండా వాన, పగలూరాత్రి.. అనే తేడా లేకుండా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఆరో రోజైన ఆదివారం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద 24 గంటలపాటు రాత్రీపగలూ బైఠాయింపు చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ రాత్రి 11 గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చారు. కొత్త డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌తో కలిసి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు ఒప్పుకుంటుందని, ఏమేం అవసరమో పైనుంచి అడిగారని వివరించారు.

సోమవారం తరగతులకు హాజరుకావాలని, హామీలు అమలు చేసేలా మంగళవారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి తొలుత విద్యార్థులు నో చెప్పినా.. కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత కూడా ఇదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా.. ఆదివారం ఉదయం హైదరాబాద్, నిజామాబాద్‌లకు చెందిన ఏబీవీపీ నాయకులు వర్సిటీవైపు దూసుకురాగా, పోలీసులు అడ్డుకుని లాక్కెళ్లారు. వివిధ జిల్లాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలు చేపట్టారు. ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థులు 24 గంటల దీక్షకు సిద్ధమయ్యారు.

శాంతియుత పద్ధతుల్లో రోజుకో తీరులో నిరసనలు చేపడుతున్నారు. యోగా వారోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం కాసేపు యోగా, ధ్యానం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినాలంటూ.. ‘సారూ.. దిగిరారె.. చూడరె మా ఆవేదనలను..’అంటూ ఓ పాటను రూపొందించి ట్విట్టర్‌లో పెట్టారు. పోలీసులు మీడియాను అనుమతించకపోవడంతో విద్యార్థులు ట్విట్టర్, యూట్యూబ్‌ల ద్వారా తమ ఆందోళన వివరాలను అప్‌డేట్‌ చేస్తున్నారు. ఆర్జీయూకేటీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

పంపించేస్తున్నారని..
ట్రిపుల్‌ ఐటీ సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు తాము నిరవధిక ఆందోళన చేస్తుంటే.. అధికారులు మాత్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు. కొంతమంది పీయూసీ–1, 2(ఇంటర్‌ తరహా) విద్యార్థులను అవుట్‌పాసులు లేకున్నా, వారి తల్లిదండ్రులు రాకున్నా పంపించేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు తమ పోరును ఆపలేవని స్పష్టం చేశారు. ఆందోళనలో యథాతథంగా బీ–1, 2, 3, 4 విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు.

దూసుకొచ్చిన ఏబీవీపీ
విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఒక్కసారిగా వర్సిటీ వైపు దూసుకువచ్చారు. ముందస్తుగానే ఏబీవీపీ వర్సిటీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్మల్‌ జిల్లాలో పరిషత్‌ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనూహ్యంగా హైదరాబాద్, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ఒక్కసారిగా ప్రధాన ద్వారం వైపు చొచ్చుకువచ్చారు. ఈ పరిణామంతో పోలీసులు వారిని అడ్డుకొని వాహనాల్లో తరలించారు.

మరిన్ని వార్తలు