బాలాలయానికి సరస్వతీ అమ్మవారు!

19 Mar, 2023 02:49 IST|Sakshi

బాసర ఆలయ పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తి  

శృంగేరి పీఠాధిపతి సూచనలతో నమూనా సిద్ధం 

ప్రభుత్వ అనుమతి రాగానే టెండర్లు 

భైంసా: సరస్వతీ దేవి కొలువైన బాసర ప్రధాన ఆలయం పునర్నీర్మాణానికి కసరత్తు పూర్తయింది. ఇప్పటికే అర్చకులు, అధికారులు, వైదిక బృందం శృంగేరి వెళ్లి పీఠాధిపతి విదుశేఖర భారతిస్వామి సూచనలతో నమూనా రూపొందించారు. గర్భగుడిలో మార్పులు చేర్పులపై పీఠాధిపతి చేసిన సూచనలను ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన పండితులు.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డికి వివరించారు.

కొత్త నమూనాలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రెండు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరమైన బాసర ఆలయానికి రూ.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా భక్తులు వచ్చే ఈ క్షేత్రంలో అనునిత్యం అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు బాసర వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో పునర్నీర్మాణ పనులు ప్రారంభమైతే ప్రస్తుతం ఉన్న ప్రధానాలయం వద్ద భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి.

పనుల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటుచేసి అమ్మవారికి పూజలు నిర్వహించనున్నారు. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఎన్నికలకు ముందే ప్రారంభించేలా.. 
ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పలు దఫాలుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి నూతన నమూనాలు, మాస్టర్‌ప్లాన్‌ తదితరాలపై కసరత్తు పూర్తి చేశారు. ఇటీవల బాసర వచి్చన మంత్రి మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై ఆలయ అధికారులతో చర్చించారు.  

కృష్ణ శిలలతో నిర్మాణం... 
గర్భాలయాన్ని కృష్ణశిలలతో అత్యద్భుతంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం సరస్వతి అమ్మవారి దర్శన సమయంలో పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకార మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మారి్పడి, నలుదిక్కులా రాజగోపురాల నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ద్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు