Hyderabad: ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు 

30 May, 2021 10:49 IST|Sakshi

బత్తిని హరినాథ్‌గౌడ్‌

దూద్‌బౌలి (హైదరాబాద్‌): కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని శనివారం బత్తిని హరినాథ్‌గౌడ్‌ తెలిపారు. 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం అందిస్తున్న చేప ప్రసాదాన్ని గతేడాది కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేదన్నారు. మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసంలో సత్యనారాయణ వ్రతంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులందరం తీసుకుంటామని.. అలాగే తమ దగ్గరి బంధువులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా చేప ప్రసాదం పంపిణీని విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సూచించారని హరినాథ్‌గౌడ్‌ వెల్లడించారు. ఏటా దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు చేప ప్రసాదాన్ని సేవించేందుకు ఇక్కడికి వచ్చేవారని.. రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్‌ ఉండటంతో చేప ప్రసాదం కోసం రోగులు వచ్చేందుకు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రభుత్వం చెప్పిందని, ఆ మేరకు ప్రసాదాన్ని ఇవ్వడం లేదని చెప్పారు.
చదవండి: లాక్‌డౌన్‌ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు