Bathukamma Day 7: 'వేపకాయల బతుకమ్మ' ప్రత్యేకత ఇదే!

12 Oct, 2021 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి చిహ్నమైన బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. మంగళవారం ఏడవ రోజు వేపకాయల బతుకమ్మగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు. తొమ్మిది రోజులు పాటుసాగనున్న ఈ సంబురంలో ఈ రోజు సకినాల పిండితో వేపకాయల నైవేద్యాన్ని ప్రసాదంగా నివేదిస్తారు. మహిళలు ఉత్సాహంగా ఆడిపాడుతూ చల్లగా దీవించుతల్లీ అంటూ  గౌరమ్మకు మొక్కుతారు. 

ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ సంబురాలను ముగించుకున్న మహిళలు ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ‘‘వాడవాడంత ఉయ్యాలో.. పూల వనమాయే  ఉయ్యాలో’’ అంటూ తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆడుకొంటారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు. లేదా పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. అనంతరం ఆ బతుకమ్మను చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తారు.

తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ వేడుకలు 9 రోజులపాటు కొనసాగుతాయి. తెలంగాణ వీధులన్నీ రంగురంగుల పూలతో అందంగా అలంకరించిని బతుకమ్మలతో కళకళలాడుతున్నాయి. అందమైన కన్నెపిల్లలు, చక్కటి ముస్తాబుతో మహిళలతో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ వేడుకలు 9వ రోజున సద్దులబతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి.

సెప్టెంబరు, అక్టోబరు మాసాలు ప్రజలకు పండుగల నెలలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలొస్తాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి దసరా లేదా విజయ దశమి. ముఖ్యంగా తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ రెండు పండుగల్లో ఇంటికి వచ్చిన కొత్త పెళ్లికూతుళ్లతో ఆయా కుటుంబాలు కోలాహలంగా ఉంటాయి. మరోవైపు మహిళలు భక్తి శ్రద్ధలతో  గౌరీదేవిని పూజించడంతో పాటు దసరా సంబరాలకు సిద్ధమవుతున్నారు. దసరా పండుగ సమీపిస్తున్న సమయంలో దుకాణాల్లో షాపింగులతో కళకళలాడుతున్నాయి. అటు పూల దుకాణాలు, ఇటు వస్త్ర, బంగారు ఆభరణాలు షాపులు  కొనుగోలుదారులతో బిజీ బిజీగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు