స్కాలర్‌షిప్‌లు పెంచకుంటే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం 

5 Sep, 2022 04:01 IST|Sakshi

సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు పెంచకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సదస్సులో ఆర్‌.కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

పేద విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీసీ గురుకులాలకు ఒక ఐఏఎస్‌ను నియమించకపోవటం బాధాకరమన్నారు. తెలంగాణలో బీసీ సంక్షేమశాఖ నిర్వీర్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 240 బీసీ హాస్టళ్లు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. విదేశాల్లో విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి బీసీ విద్యార్థికి 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.   

>
మరిన్ని వార్తలు