గురుకుల సంక్షేమ హాస్టళ్లలో మరణాలు అరికట్టాలి 

10 Sep, 2022 04:04 IST|Sakshi

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌   

కాచిగూడ (హైదరాబాద్‌): గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో పిల్లల మరణాలను అరికట్టాలని, మెస్‌ చార్జీలు పెంచాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరపాలని ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారని, విషజ్వరాలు, అనారోగ్యం ఒకవైపు, నాసిరకం ఆహారంతో మరోవైపు విద్యార్థులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి కమిటీ వేసి హాస్టళ్లు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  హాస్టల్‌ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థుల కాస్మెటిక్‌ చార్జీలను బాలురకు నెలకు రూ.62 నుంచి రూ.300 లకు, బాలికలకు రూ.75 నుంచి రూ.400 వరకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.    

మరిన్ని వార్తలు