ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి: కృష్ణయ్య 

23 Aug, 2022 04:32 IST|Sakshi
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఆర్‌.కృష్ణయ్య   

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 15 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.3,500 కోట్లు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లను పెంచాలని, బీసీ, ఈబీసీ విద్యార్థుల మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేయాలని కోరారు.

పై డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న కలెక్టరేట్‌లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం బీసీలకు బడ్జెట్‌ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని, రెండేళ్లుగా 15 లక్షల మంది కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యా లు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చలో కలెక్టరేట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.  

మరిన్ని వార్తలు