9న చలో ఢిల్లీ, పార్లమెంట్‌ ముట్టడి: కృష్ణయ్య 

30 Jul, 2022 01:07 IST|Sakshi

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కుల గణన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 9న చలో ఢిల్లీ, పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సేన జాతీయ సమావేశం సేన జాతీ య అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌లో బిల్లు పెడితే అధికార బీజేపీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీ బిల్లు సాధన కోసం బీసీ ఎంపీలందరూ పార్లమెంట్‌లో డిమాండ్‌ చేయాలని కృష్ణయ్య కోరారు.

బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులపై క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ రంగంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బర్క కృష్ణయాదవ్‌ మాట్లాడుతూ బీసీల డిమాండ్లను ఆమోదించేంత వరకు ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు మాదప్ప, నాగరాజు, రాములుయాదవ్, అశోక్, అంజి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు