పాముకాటుతో హాస్టల్‌ విద్యార్థి మృతి

11 Sep, 2022 03:12 IST|Sakshi

అర్ధరాత్రి ఏదో కుట్టినట్లుగా అనిపించడంతో మేల్కొన్న విద్యార్థి

గదిలో పాము కనిపించడంతో చంపేసిన తోటి విద్యార్థులు

పీహెచ్‌సీకి తీసుకెళ్తే లక్షణాల్లేవని వైద్యం చేయని సిబ్బంది 

నస్రుల్లాబాద్‌ (బాన్సువాడ)/ బాన్సువాడటౌన్‌: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ వసతి గృహంలో విద్యార్థి పాముకాటుతో మృతిచెందాడు. నస్రు ల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్‌ బీర్కూర్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతూ బీసీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి ఏదో కుట్టినట్లుగా అనిపించడంతో నిద్రలేచి మిగతా విద్యార్థులను అప్రమత్తం చేశాడు.

అక్కడే ఓ పాము కనిపించడంతో అందరూ కలిసి దానిని చంపేశారు. సాయిరాజ్‌కు వాంతులు కావడంతో వెంటనే అతడిని పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే, ఆరోగ్య సిబ్బంది కొద్దిసేపు పరిశీలించి లక్షణాల్లేవని చెప్పి, ప్రాథమిక చికిత్స చేయకుండానే విద్యార్థిని వెనక్కి పంపించేశారు. శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో సాయిరాజ్‌ నోటి నుంచి నురుగులు రావడంతో భయానికి గురైన తోటి విద్యార్థులు నైట్‌ వాచ్‌మన్, వార్డెన్, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.

తల్లిదండ్రులు, గ్రామస్తులు హాస్టల్‌కు వచ్చేసరికి సాయిరాజ్‌ మృతి చెందాడు. వార్డెన్‌ వచ్చి సాయిరాజ్‌ మృతికి కారణం చెప్పాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన గురించి తెలుసుకున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్‌ జితేష్‌వి పాటిల్‌తో మాట్లాడారు. దీంతో కలెక్టర్‌ వెంటనే వార్డెన్‌ ను సస్పెండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, ఎక్స్‌గ్రేషియా అందించేలా చూస్తామని స్పీకర్‌ ఫోన్‌లో బాధితులకు హామీనిచ్చారు. సాయిరాజ్‌ తల్లిదండ్రులు గంగామణి, మురళి కూలీలు. వీరికి మరో మూడేళ్ల పాప ఉంది.

పారిశుధ్య కార్మికురాలికీ పాముకాటు
విద్యార్థి మృతి అనంతరం అధికారుల ఆదేశాలతో శనివారం పరిసరాలను శుభ్రంచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు జ్యోతినీ ఓ పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను బాన్సువా డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

లక్షణాలు కనిపించలేదు: స్టాఫ్‌ నర్స్‌ వినోద, బీర్కూర్‌ పీహెచ్‌సీ
సాయిరాజ్‌ అస్వస్థతకు గురై రాత్రి ఒంటి గంట సమయంలో పీహెచ్‌సీకి వచ్చాడు. ఎటువంటి లక్షణాలు కనబడకపోవడంతో వైద్యం చేయలేదు. వసతిగృహంలోకి పాము వచ్చిందని తెలపడంతో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో పంపిస్తానన్నాను. అయితే, తనను పాము కరవలేదని, అక్కడికి వెళ్లబోనని సాయిరాజ్‌ చెప్పడంతో తిరిగి పంపించేశాను.

మరిన్ని వార్తలు