Rranga Reddy: ప్లాట్‌ కొంటున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త

22 Dec, 2022 11:44 IST|Sakshi
పిగ్లీపూర్‌లో జీపీఆర్‌ సంస్థ చేసిన లేక్‌వ్యూ హిల్స్‌ లేఅవుట్‌లో  ఆక్రమణకు గురైన ప్లాట్లు, పార్కు స్థలాలు (సర్కిల్‌లో)

సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్య రహిత ప్రాంతం.. నగరానికి కూతవేటు దూరం.. వెరసి అతితక్కువ ధరకే హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో అమ్మకానికి ప్లాట్లు.. అంటూ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని కొంతమంది అక్రమార్కులు ప్రకటనలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పిగ్లీపూర్‌లో ప్లాట్లు కొనుక్కునేందుకు తొందరపడుతున్నారా.. అయితే తస్మాత్‌ జాగ్రత్త..! 

రియల్‌ ముఠా చీకటి ఒప్పందం..? 
హెచ్‌ఎండీఏ లేఅవుట్ల పేరుతో 20ఏళ్ల కిత్రం చేసిన ప్లాట్లనే కబ్జా చేసి అప్పటి లేఅవుట్ల ఆనవాళ్లు కనిపించకుండా నూతన హంగులతో ముస్తాబు చేస్తు న్న రియల్‌ మోసగాళ్లు తాజాగా హెచ్‌ఎండీఏ ప్లాట్లు గా తిరిగి విక్రయించేందుకు తెగబడుతున్నారు. పిగ్లీపూర్‌ గ్రామంలో కొన్ని రియల్‌ ముఠాలు కొంతకాలంగా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరో సారి వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల సొమ్మును కాజేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఒకప్పడు వివాదరహితంగా ఉన్న పిగ్లీపూర్‌లోని భూములన్నీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయి.

పిగ్లీపూర్‌ రెవెన్యూ సర్వే నెం.12, 14, 46, 51లోని పాత లేఅవుట్లను, పార్కు స్థలాలతో పాటు ప్రభు త్వ, భూదాన్‌భూములు ఆక్రమించుకుంటున్న రియల్‌ మాఫియా హెచ్‌ఎండీఏ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చీ కటి ఒప్పందం చేసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. లే అవుట్లలోని పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడంతో అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

పదుల సంఖ్యలో డబుల్‌ లేఅవుట్లు 
పిగ్లీపూర్‌లో రెండు, మూడేళ్లుగా హెచ్‌ఎండీఏ లేఅవుట్ల పేరుతో చేపడుతున్న లేఅవుట్లన్నీ డబుల్, త్రి బుల్‌ లేఅవుట్లే. 20, 25 ఏళ్ల కిత్రం చేసిన పంచాయ తీ లేఅవుట్లనే హెచ్‌ఎండీఏ లేఅవుట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్లలోని ప్లాట్లను ప్లాన్‌ మ్యాప్‌లో చూపించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే సర్వే నెంబర్లలో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని ఎల్‌పీ నెంబర్‌ వచ్చిన తర్వాత స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్లు విక్రయించిన తర్వాత వచ్చి న భూ వివాదాలు, ఫిర్యాదుల కారణంగా హెచ్‌ఎండీఏ అధికారులు ఎల్‌పీ నెంబర్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా వదిలేశారంటే అక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతోంది. 
చదవండి: Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం

ఎక్కువ కమీషన్‌ ఆశ చూపి.. 
పాత లేఅవుట్లలోని ప్లాట్లను ఆక్రమించుకుని వాటి ఆనవాళ్లు లేకుండా చేసి నకిలీ పత్రాలతో హెచ్‌ఎండీఏ అనుమతి తీసుకోవడం కబ్జాదారుల పని... అనంతరం ఎక్కువ కమీషన్‌ ఆశచూపి ఈ డబుల్‌ లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించే బాధ్యత మార్కెటింగ్‌ కంపెనీలకు అప్పగించి చేతికి మట్టి అంటకుండా కోట్లాది రూపాయాలు సొమ్ము చేసుకుని పేదలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్లాట్లు విక్రయాలు పూర్తి అయ్యేంత వరకూ రియల్‌ మాఫియా ముఠా సభ్యులు ఎక్కడా తమ పేర్లు వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.

మార్కెటింగ్‌ ఏజెంట్లు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారినే టార్గెట్‌ చేసుకుని ప్లాట్లు విక్రయిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం ఇక్కడి వివాదాస్పద భూముల వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,ప్లాట్లు కొనేముందు అన్ని విషయాలను పరిశీలించడంతో పాటు ప్లాట్లు చేస్తున్న ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు