దుర్గాదేవిగా బెజవాడ దుర్గమ్మ.. మహాగౌరిగాశ్రీశైల భ్రమరాంబ

4 Oct, 2022 09:23 IST|Sakshi

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైనున్న జగజ్జనని దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు.  

మహాగౌరిగాశ్రీశైల భ్రమరాంబ 
శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని నందివాహనంపై ఆసీనులను కావించి అలంకార మండపంలో ఉంచారు.

తేజోనిధిగా సూర్య ప్రభపై.. నక్షత్ర వెలుగులో చంద్రప్రభపై 
తిరుమల కొండ మీద శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ సంబరం అంబరాన్ని తాకేలా సాగుతోంది. ఏడో రోజు సోమవారం ఉదయం సూర్యప్రభపై ఊరేగుతూ స్వర్ణకాంతులతో దివ్యతేజోమూర్తి భక్తులకు దర్శనమి చ్చారు. రాత్రి చంద్రప్రభపై చల్లని చంద్రకాంతుల్లో భక్తులను అనుగ్రహించారు. శ్రీవేంకటేశ్వరుడికి సూర్యచంద్రులు రెండు నేత్రాలు. సూర్యుడు తేజోనిధి, ప్రకృతికి చైతన్య ప్రదాత, సకల రోగాల నివారకుడు. స్వర్ణకాంతులీనే భాస్కరుడిని సప్తఅశ్వాల రథసారధిగా చేసుకుని మలయప్ప మత్స్య నారాయణుడి అలంకారంలో స్వర్ణ కాంతులీనుతూ ఉదయం వేళ తిరుమాడవీధుల్లో వైభవంగా విహరించారు. ఇక భగవంతుని మారు రూపమైన చంద్రుడిని వాహనంగా మలుచుకున్న వేంకటాచలపతి రాత్రి వేళలో తిరుమాడ వీధుల్లో ఊరేగారు.

మరిన్ని వార్తలు