ఉచిత బియ్యం ఉఫ్‌! సాక్షాత్తు లబ్ధి దారులే అమ్ముకుంటున్నారు

26 Jul, 2022 07:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. కరోనా నేపథ్యంలో నిరుపేదలు అకలితో అలమటించవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం లక్ష్యం నీరుగారుతోంది. సాక్షాత్తూ లబ్ధిదారుల కుటుంబాలు ఉచితం బియ్యాన్ని కారుచౌకగా చిరు వ్యాపారులకు అమ్ముకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

ప్రస్తుతం ఆహార భద్రత (రేషన్‌) కార్డులోని సభ్యుడి (యూనిట్‌)కి 10 కిలోల చొప్పున సభ్యుల సంఖ్యను బట్టి కుటుంబానికి కనీసం 30 కిలోల నుంచి 60 కిలోల బియ్యం వరకు ఉచితంగా పంపిణీ జరుగుతోంది. ఉచిత బియ్యంపై అనాసక్తి  ఉన్నప్పటికీ డ్రా చేయకుంటే కార్డు ఇన్‌ యాక్టివ్‌లో పడిపోయి రద్దవుతుందన్న అపోహతో అవసరం లేని లబ్ధి కుటుంబాలు సైతం బియ్యం డ్రా చేసి చిరు, వీధి వ్యాపారులకు కారుచౌకగా అప్పజేప్పేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బస్తీల్లో  కొనుగోలు కేంద్రాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. 

ప్రస్తుతం పీడీఎస్‌ బియ్యం నిల్వలు అధికమై డిమాండ్‌ తగ్గడంతో కిలో రూ.5 నుంచి 8 వరకు ధర మించి పలకడం లేదు.   పౌరసరఫరాల, పోలీసు అధికారుల  మొక్కుబడిగా తనిఖీలు, దాడులు చేస్తుండటంతో క్వింటాళ్లకొద్దీ అక్రమ నిల్వలు పట్టుబడుతున్నాయి. 

గత రెండేళ్ల నుంచి.. 
కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద ఉచిత రేషన్‌ కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచిత బియ్యం పథకం కాలపరిమితి ముగుస్తున్నా.. కేంద్రం పథకాన్ని పొడిగిస్తూ వస్తోంది. 

అవసరం ఉన్నవారు సగమే.. 
హైదరాబాద్‌ మహా నగరంలోని ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాల్లో పీడీఎస్‌ బియ్యం వండుకొని తినేవారు  సగమే.  మిగిలిన సగం కుటుంబాలు కేవలం అల్పాహారం ఇడ్లీ, దోసెలు, పిండి వంటలకు మాత్రమే రేషన్‌ బియ్యం వినియోగిస్తుంటారు.  వాస్తవంగా వారి అవసరాలకు నెలకు నాలుగు కిలోల కంటే మించవు. రేషన్‌ బియ్యం అవసం లేకున్నా.. క్రమం తప్పకుండా డ్రా చేసి కారు చౌకగా దళారులకు ముట్టజెప్పడం సర్వసాధారణంగా మారింది.  

ప్రతి నెలా.. కోటా ఇలా 
గ్రేటర్‌లోని హైదరాబాద్‌– రంగారెడ్డి– మేడ్చల్‌ జిల్లాల పరిధిలో సుమారు 16 లక్షల ఆహార భద్రత కార్డు లబ్ధి కుటుంబాలు ఉండగా, అందులో 55.63 లక్షల లబ్థిదారులు ఉన్నారు. ప్రతి నెలా ఉచిత బియ్యం కోటా కింద 111 మెట్రిక్‌ టన్నులు విడుదలవుతున్నాయి.  

(చదవండి: ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్‌)

మరిన్ని వార్తలు