20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..

7 Jan, 2023 14:25 IST|Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌ (హైదరాబాద్‌): రూ.20 కోట్లకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాదీ నుంచి ఖరీదైన పెట్‌ను సొంతం చేసుకున్నాడంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తవం. రష్యాకు చెందిన ‘కొకేషియన్‌ షెపర్డ్‌’ అనే జాతికి చెందిన కుక్క కోసం హైదరాబాద్‌కు చెందిన కన్‌స్ట్రక్టర్‌ బెంగళూరులోని ‘ఇండియన్‌ డాగ్‌ బ్రీడర్స్‌ అసొసియేషన్‌’ ప్రెసిడెంట్, పెట్‌ యజమానైన సతీష్‌ కెడబామ్స్‌ను సంప్రదించాడు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పెట్‌కు రూ.20కోట్లు ఇస్తానంటూ యజమానికి ఆఫర్‌ ఇచ్చాడు. తాను ఈ ఆఫర్‌ను నిరాకరించానని, ఈ పెట్‌ను రూ.100కోట్లు ఇచ్చినా అమ్మేది లేదంటూ ఆయన ‘సాక్షి’కి చెప్పారు. రూ.20కోట్లకు తాను కొన్నానంటూ వచ్చిన కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. ‘రష్యాకు చెందిన ఈ కొకేషియన్‌ షెపర్డ్‌ జాతి శునకం వయసు ఏడాదిన్నర్ర, బరువు 100కేజీలు.

ఇది దక్షిణ రష్యాలోని ఆర్మేనియా, అజర్‌బైజాన్, జార్జియాలతోపాటు టర్కీలో కూడా లభిస్తుంది. చూడటానికిది ఆడ సింహం మాదిరిగా ఉంటుంది. ఈ జాతికి చెందిన శునకం మనదేశంలో దొరికినప్పటికీ రష్యాలో ఉన్న మాదిరిగా ఉండదు. ‘కెడబామ్స్‌ హైడర్‌’ అని ముద్దుగా పిలిచే ఈ శునకం త్రివేండ్రంలో జరిగిన ‘కెనల్‌ క్లబ్‌ కాంపిటీషన్‌’లో 32 మెడల్స్‌ను సొంతం చేసుకుని ది బెస్ట్‌ డాగ్‌గా నిలిచింది’ అని కెడబామ్స్‌ చెప్పారు.   

చదవండి: (ఒకేసారి బండి, ఈటల ప్రసంగం.. సాంకేతిక లోపమా? కావాలనే చేశారా?)

మరిన్ని వార్తలు