ఆ నంబర్లతో బీ ‘కేర్‌’ఫుల్‌!.. ఇంటర్నెట్‌లో దొంగ కస్టమర్‌ కేర్‌ నంబర్ల సృష్టి 

29 Sep, 2022 08:48 IST|Sakshi

సంబంధిత బ్యాంకు లేదా సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ మోసం 

బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు 

బ్యాంకులు, సంస్థల అధికారిక వెబ్‌సైట్లలోని నంబర్లలో మాత్రమే సంప్రదించాలంటున్న పోలీసులు 

క్రెడిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ షాపింగ్, ఉద్యోగాల కన్సల్టెన్సీ, లోన్లు పేరిటా బురిడీ 

ఏటా నమోదవుతున్న కేసుల్లో 66 శాతం ఈ తరహా కేసులే.. 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌కు చెందిన శరత్‌ తన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు బిల్‌ పేమెంట్‌ను ఫోన్‌పే గేట్‌వే ద్వారా చెల్లించాడు. అయితే గంటలు గడిచినా కూడా తనకు పేమెంట్‌ కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ రాకపోవడంతో గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్‌ వెతికాడు. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్‌ కేర్‌ అని ఉన్న ఓ నంబర్‌కు డయల్‌ చేశాడు. అవతలి వ్యక్తి అడిగిన కార్డు నంబర్, పిన్‌.. ఇలా అన్ని వివరాలు చెప్పేశాడు. కొద్దిసేపటి తర్వాత కార్డు నుంచి రూ.1.2 లక్షలు డెబిట్‌ అయినట్టు సందేశం రావడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

గూగుల్‌లో కస్టమర్‌ కేర్‌ నంబర్లు పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్‌ పోలీసులు గుర్తించారు. బ్యాంకు అయినా, మరే ఇతర సంస్థ అయినా.. వాటి కస్టమర్‌ కేర్‌ నంబర్లను గూగుల్‌లో కాకుండా సంబంధిత సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో గుర్తించి సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా ఒక్క శరత్‌ మాత్రమే కాదు రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలా దొంగ కస్టమర్‌ కేర్‌ నంబర్ల ద్వారా మోసపోయిన బాధితులు వేలల్లో ఉండటం ఆందోళన కల్గిస్తున్న అంశం.  

అవగాహన, అప్రమత్తతే రక్ష... 
క్రెడిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ షాపింగ్, ఉద్యోగాల కన్సల్టెన్సీ, లోన్లు పేరిట, అలాగే బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ సైబర్‌ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ అని నంబర్లు అని పెట్టి సైతం మోసాలు చేస్తున్నారు. బాలానగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడికి రూ.2,800 ఫోన్‌ పే చేశాడు. కానీ డబ్బు అతడికి చేరకపోవడంతో గూగుల్‌లో ఫోన్‌పే పేరిట ఉన్న కస్టమర్‌ కేర్‌ అనే నంబర్‌కు కాల్‌ చేశాడు. అవతల వైపు ఉన్న వ్యక్తి అకౌంట్‌ నంబర్‌ అడగడంతో చెప్పాడు. నేరగాడు ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయమని చెప్పడంతో ఇన్‌స్టాల్‌ చేశాడు.

ఆ తర్వాత కొద్ది సేపటికి అతని అకౌంట్‌ నుంచి రూ.75 వేల నగదును ఐదు సార్లు ఇతర అకౌంట్లలోకి బదిలీ చేసినట్టు సందేశం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇలా ఇంటర్నెట్‌లో ఏది పడితే అదే కస్టమర్‌ కేర్‌ నంబర్‌ అనుకొని పొరపడి కాల్‌ చేసి బ్యాంకు ఖాతాల వివరాలు షేర్‌ చేయడంతో, దేశవ్యాప్తంగా ఏటా రూ.3 వేల కోట్లకు పైగా సైబర్‌ నేరగాళ్లు దోచేస్తున్నారని దర్యాప్తు బృందాలు తెలిపాయి. అమాయకంగా నమ్మేయకుండా కనీస అవగాహన, అప్రమత్తతతో వ్యవహరిస్తే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చని పోలీస్‌ శాఖ సూచిస్తోంది.  

బ్యాంక్‌ లోన్‌ పేరిట.. 
సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ బ్యాంకు పేరిట వచ్చిన ఫోన్‌ కాల్‌ మాట్లాడింది. అవతలి వ్యక్తి మీకు లోన్‌ ఆఫర్‌ వచ్చింది, రూ.2 లక్షలు అకౌంట్లోకి పంపిస్తాము. రెండేళ్ల తర్వాత కడితే సరిపోతుంది అని చెప్పాడు. సంబంధిత మహిళ నమ్మి సైబర్‌ నేరస్తుడు అడిగిన ఆధార్‌ కార్డు నంబర్, బ్యాంకు అకౌంట్‌ నంబర్, మొబైల్‌ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ సైతం చెప్పి రూ.42 వేలు పోగొట్టుకుంది. డబ్బులు పోయిన విషయం కూడా ఆలస్యంగా తెలియడంతో తన కుమారుడికి చెప్పుకొని లబోదిబోమంది. ఇలా రుణాల పేరిట కూడా సైబర్‌ నేరగాళ్లు అమాయకులను టార్గెట్‌గా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు.  

ఉద్యోగావకాశాలంటూ మోసం 
ఈ మెయిల్స్‌ ద్వారా ఉద్యోగావకాశాల ప్రకటనలు చూసిన జీడిమెట్లకు చెందిన సందీప్‌ వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేశాడు. పేరు, విద్యార్హతలు, ఫొటో, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌.. ఇలా అన్ని వివరాలు అడిగారు. ఉద్యోగావకాశం కావడంతో సందీప్‌ నిజాయితీగా అన్ని ఫిల్‌ చేశాడు. సబ్‌మిట్‌ బటన్‌ క్లిక్‌ చేయగానే ఓటీపీ వస్తుంది ఎంటర్‌ చేయాలని ఉంది. అదే రీతిలో ఓటీపీ ఎంటర్‌ చేశాడు.

ఆ తర్వాత మరో మెయిల్‌ వస్తుంది, సంబంధిత లింక్‌ను మొబైల్‌లో క్లిక్‌ చేస్తే నివసిస్తున్న నగరంలోని ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఆఫర్లకు సంబంధించిన అలర్ట్స్‌ వస్తాయని సూచించడంతో ఓపెన్‌ చేశాడు. అంతే ఆ మొబైల్‌లో రిమోట్‌ కంట్రోల్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ అయ్యింది, ఆ విషయం సందీప్‌కు తెలియదు. మరుసటి రోజు తన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ. 12 వేలు డెబిట్‌ అయినట్టు సందేశం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. మొబైల్‌ ఫోన్‌లోని రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌ ద్వా­రా ఓటీపీలను రిసీవ్‌ చేసుకొని డబ్బులు కొట్టేసినట్టు పోలీసులు గుర్తించారు.  

బ్యాంకు అకౌంట్‌ నంబర్లు, ఓటీపీలు చెప్పొద్దు.. 
దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్‌ నేరాల్లో కాల్‌ సెంటర్లు, కస్టమర్‌ కేర్, కేవైసీ అప్‌డేట్, ఉద్యోగం, లోన్లు.. ఈ తరహా మోసాలే 66 శాతం వరకు ఉన్నాయని సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటర్నెట్‌ విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం కష్టంగా మారడమే సైబర్‌ నేరస్తుల పాలిట కల్పతరువుగా మారిందని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకు అకౌంట్‌ నంబర్లు, ఓటీపీలు చెప్పి, అనుమానాస్పద లింక్స్‌ క్లిక్‌ చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు.   

మరిన్ని వార్తలు