బ్యాంకుల్లో డిపాజిట్లు జాగ్రత్త!

22 Feb, 2022 04:34 IST|Sakshi

అన్ని శాఖల బ్యాంకు అకౌంట్లు, ఎఫ్‌డీల వివరాలు వెంటనే పంపండి 

వేర్వేరు బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‌డీలు ఒకే బ్యాంకు పరిధిలోకి  

ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి కొత్త అకౌంట్లను తెరవొద్దు 

ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని వివరాలను వెంటనే తమకు పంపాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థలు, స్థానిక సంస్థలు, జిల్లా కలెక్టర్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ల వివరాలు, ఆయా అకౌంట్లలో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వివరాలను వెంటనే ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం జీవో నంబర్‌ 18ని జారీ చేశారు.

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్‌మాల్‌ నేపథ్యంలో బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పలు జాగ్రత్తలను సూచిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న బ్యాంకు అకౌంట్లన్నింటినీ ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకునే తెరిచారా.. లేదా? ప్రస్తుతమున్న అకౌంట్లను సమీక్షించి అవసరం లేని అకౌంట్లను మూసివేసే అంశాలపై వచ్చే నెల 10వ తేదీ కల్లా నివేదిక ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆయా బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పరిస్థితిని పరిశీలించాలని, డిపాజిట్‌ చేసిన మేరకు నగదు ఉందో లేదో తనిఖీ చేయడంతో పాటు ఆయా బ్యాంకుల నుంచి తాజాగా సర్టిఫికెట్లు తీసుకుని తమకు పంపాలని ఆర్థిక శాఖ సూచించింది.

ఒకే బ్యాంకులోకి డిపాజిట్లు..  
అదే విధంగా ఒక శాఖ లేదా సంస్థకు పలు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్యానెల్‌మెంట్‌ చేసిన ఏదైనా ఒకే బ్యాంకులోకి మార్చాలని, ఈ క్రమంలో వడ్డీ తగ్గకుండా చూసుకోవాలని కోరింది. ఒకవేళ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను క్లోజ్‌ చేసే అవకాశం లేకపోతే ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోవాలని పేర్కొంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వివరాలన్నింటినీ ప్రతి నెలా 10వ తేదీ కల్లా అప్‌డేట్‌ చేయాలని వెల్లడించింది.

ఇక నుంచి ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కొత్తగా బ్యాంకు అకౌంట్లు తెరవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను డిపాజిట్ల రూపంలోకి ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని, డిపాజిట్ల ఉపసంహరణ కాలపరిమితి ఎప్పుడు ముగుస్తుందన్న విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లావాదేవీలన్నీ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లో నగదు రూపంలో లావాదేవీలు జరగకూడదని, కచ్చితంగా ప్రభుత్వ అధికారిక ఈమెయిల్, మొబైల్‌ నంబర్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులపై వచ్చిన వడ్డీని ఆ పథకం కిందనే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది. వడ్డీ కింద వచ్చిన మొత్తాన్ని ఖర్చు చేసే విషయంలో వార్షిక ఆడిట్‌ నివేదికలో స్పష్టంగా నమోదు చేయాలని ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు