అదిగదిగో ప్లానెట్‌ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా

4 Oct, 2021 01:02 IST|Sakshi
ప్లానెట్‌ 9

మన సౌర కుటుంబంలో గ్రహాలెన్ని? ఇదేం ప్రశ్న తొమ్మిది గ్రహాలు కదా అంటారా.. కాదు కాదు.. ఫ్లూటోను లిస్టులోంచి తీసేశారు కాబట్టి ఎనిమిదే అంటారా.. ఏం అన్నా అనకున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం ఫ్లూటో కాకుండానే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫ్లూటో అవతల ఓ పెద్ద గ్రహం ఉందనడానికి కొన్నిరకాల ఆధారాలు ఉన్నాయని, కానీ దాని జాడ మాత్రం కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు. మరికొందరు శాస్త్రవేత్తలేమో.. అలాంటి గ్రహమేదీ లేకపోవచ్చని చెప్తున్నారు. అసలు ఈ తొమ్మిదో గ్రహం ఏమిటి? దానికి ఆధారాలేమిటి? ఈ వివరాలేమిటో తెలుసుకుందామా? 

ఫ్లూటోను తొలగించాక.. 
మనం చిన్నప్పటి నుంచీ సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయనే చదువుకున్నాం. కానీ కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు.. గ్రహాలకు సంబంధించి కొన్ని పరిమాణం, ఆకృతి, దాని కక్ష్య వంటి పలు నిబంధనలు రూపొందించారు. అందులో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు.


ప్లూటో 

అప్పటి నుంచి మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలే (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్‌) మాత్రమే మిగిలాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఫ్లూటోకు కొంచెం అటూఇటూగా మరో మూడు, నాలుగు మరుగుజ్జు గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. కానీ ఇటీవల ఫ్లూటో, ఇతర మరుగుజ్జు గ్రహాలు కాకుండానే.. తొమ్మిదో గ్రహం ఉండి ఉంటుందన్న ప్రతిపాదనలు మొదలయ్యాయి. 

‘ప్లానెట్‌ 9’ ఉందంటూ.. 
2016లో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కాల్‌టెక్‌)కు చెందిన అంతరిక్ష పరిశోధకులు మైక్‌ బ్రౌన్, కోన్‌స్టాంటిన్‌ బటిగిన్‌  ‘ప్లానెట్‌ 9’ను ప్రతిపాదించారు. ఫ్లూటో అవతల సౌర కుటుంబం చివరిలో ఓ భారీ గ్రహం పరిభ్రమిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దానికి ప్రస్తుతానికి ‘ప్లానెట్‌ 9’ అని పేరు పెట్టారు. 


2018లో ది ఆస్ట్రానమికల్‌ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధన కూడా సౌర కుటుంబం అంచుల్లో ఏదో పెద్ద గ్రహం ఉండవచ్చని అంచనా వేసింది. ‘2015 బీపీ519’గా పిలిచే ఓ భారీ ఆస్టరాయిడ్‌ కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి.. నెప్ట్యూన్‌ కక్ష్యకు సమీపంగా సూర్యుడి చుట్టూ తిరిగి వెళుతుంది. అంత దూరంలో భారీ గ్రహం ఉందని, దాని ఆకర్షణ వల్లే ఈ ఆస్టరాయిడ్‌ సౌర కుటుంబం పరిధిలో ఉందని శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. 

భారీ గ్రహాల గురుత్వాకర్షణను బట్టి.. 
అంతరిక్షంలో నక్షత్రాలు, భారీ గ్రహాల గురుత్వాకర్షణ శక్తి చుట్టూ ఉండే గ్రహాలు, ఆస్టరాయిడ్లు, ఇతర ఖగోళ వస్తువులపై ప్రభావం చూపుతూ ఉంటుంది. సౌర కుటుంబంలోనే అతి భారీ గ్రహమైన గురుడి గురుత్వాకర్షణ కారణంగానే.. ఆ గ్రహ కక్ష్యలో, అంగారకుడు–గురు గ్రహాల మధ్య పెద్ద సంఖ్యలో ఆస్టరాయిడ్లు తిరుగుతుంటాయి. అదే తరహాలో క్యూపియర్‌ బెల్ట్‌లోనూ ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు గుంపులుగా పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏదైనా భారీ గ్రహం గురుత్వాకర్షణ ప్రభావం చూపితే తప్ప.. ఆస్టరాయిడ్లు, మరుగుజ్జు గ్రహాలు అలా వ్యవహరించవని సూత్రీకరించారు. 


మార్స్‌–గురు గ్రహాల మధ్య ఆస్టరాయిడ్‌ బెల్ట్‌ ఉన్నట్టుగానే.. నెప్ట్యూన్‌ గ్రహం పరిభ్రమించే చోటు నుంచి అవతల సుమారు 500 కోట్ల కిలోమీటర్ల వెడల్పున మరో బెల్ట్‌ ఉంటుంది. దానినే క్యూపియర్‌ బెల్ట్‌ అంటారు. ప్లూటోతోపాటు ఎన్నో మరుగుజ్జు గ్రహాలు, కోట్ల సంఖ్యలో ఆస్టరాయిడ్లు ఆ బెల్ట్‌లోనే తిరుగుతుంటాయి. 

ఆ గ్రహం ఎలా ఉండొచ్చు? 
క్యూపియర్‌ బెల్ట్‌లో మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల గుంపులు, కక్ష్య, పరిమాణాలను బట్టి.. పలు కంప్యూటర్‌ సిమ్యులేషన్లు, గణిత సూత్రాల ఆధారంగా ‘ప్లానెట్‌ 9’ అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆ లెక్కన.. 


భూమి   ప్లానెట్‌ 9 
భూమితో పోలిస్తే ప్లానెట్‌ 9 పది రెట్లు పెద్దగా ఉండి ఉంటుంది. 
సూర్యుడి నుంచి నెప్ట్యూన్‌ ఎంతదూరంలో ఉందో.. అంతకు 20 రెట్లు దూరంలో తిరుగుతూ ఉంటుంది. 
ప్లానెట్‌–9 సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు కనీసం 10 వేల ఏళ్ల నుంచి 20 వేల ఏళ్లకుపైగా సమయం పడుతుంది. 

నేరుగా ఎందుకు గుర్తించలేం? 
సౌర కుటుంబం అంచుల్లో ఉన్న గ్రహాలు, మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్లు పరిభ్రమించే వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా సూర్యుడి చుట్టూ తిరిగేందుకు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మనం పరిశీలిస్తున్న సమయంలో.. అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలియదు.అందువల్ల వాటిని నేరుగా గుర్తించడం కష్టం. ఒకసారి గుర్తిస్తే.. వాటి పరిమాణం, వేగం, ఇతర అంశాలు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. 


సూర్యుడు    ప్లానెట్‌ 9 
సౌర కుటుంబం చివరిలో ఉన్న నెప్ట్యూన్‌ సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగేందుకు 165 ఏళ్లు పడుతుంది. అదే ప్లూటోకు 248 ఏళ్లు, దాని అవతల ఉన్న మరుగుజ్జు గ్రహం ఎరిస్‌కు 558 ఏళ్లు, సెడ్నాకు 11,408 ఏళ్లు పడుతుంది. 

భిన్న వాదన కూడా ఉంది 
క్యూపియర్‌ బెల్ట్‌లోని కొన్ని మరుగుజ్జు గ్రహాలు, ఆస్టరాయిడ్ల కక్ష్య, ఇతర అంశాలు భిన్నంగా ఉండటానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చని.. అక్కడ భారీ గ్రహం ఉండకపోవచ్చని మరికొందరు శాస్త్రవేత్తలు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.   

ఒకవేళ బ్లాక్‌ హోల్‌ అయితే? 
సౌర కుటుంబం ఆవల భారీ గ్రహం కాకుండా.. చిన్న స్థాయి బ్లాక్‌హోల్‌ ఉండి ఉండొచ్చని మరో ప్రతిపాదన కూడా ఉంది. ఆ బ్లాక్‌హోల్‌ ప్రభావం వల్లే కొన్ని ఆస్టరాయిడ్లు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని 2020లో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనా పత్రం వెలువరించారు. ఖగోళ వస్తువులను ఇన్‌ఫ్రారెడ్‌ తరంగాల ద్వారా కాకుండా.. ఎక్స్‌రే, గామా కిరణాల ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని సూచించారు.   

మరిన్ని వార్తలు