Godavari Floods 2022: వరదొచ్చి నెల.. బతికేదెలా? రూ.10 వేల తక్షణ సాయానికి సాంకేతిక చిక్కులు

11 Aug, 2022 00:51 IST|Sakshi
వరదల కారణంగా దెబ్బతినడంతో ప్రజలు వదిలేసిన ఇళ్లు 

భద్రాద్రి జిల్లాలో విధ్వంసం సృష్టించిన గోదావరి వరదలు

వర్షాలతో కూలిపనులు లేక ఇక్కట్లు

ఇళ్ల మరమ్మతు చేయించలేక వదిలేసి వెళ్తున్న ప్రజలు

తాండ్ర కృష్ణగోవింద్‌
ఉవ్వెత్తున ఎగిసిన గోదావరి వరద తీరప్రాంతాలను ముంచెత్తింది. ఉగ్ర గోదావరి ధాటికి వేలాది మంది ఇల్లూవాకిలి వదిలి సహాయక శిబిరాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నెల రోజులు గడిచినా ఇప్పటికీ బాధితుల్లో సగం మంది సొంతింటికి దూరంగానే ఉన్నా­రు. ఓ వైపు ఆస్తులు కోల్పోయి, మరోవైపు పనుల్లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ తోడ్పాటు, దాతలు అందించే సాయంతోనే ఇంకా బతుకు బండి నెట్టుకొస్తున్నారు. 

జూలైలోనే వచ్చింది..
సాధారణంగా గోదావరికి ఆగస్టులో వరదలు వస్తుంటాయి. కానీ ఈసారి జూలై ఆరంభంలోనే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగాయి. గత నెల 11న భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో పాత రికార్డులు చెరిపేస్తూ జూలైలోనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను శిబిరాలకు తరలించడం మొదలెట్టారు.

ఆ తర్వాత జూలై 16 వరకు గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతూ 71.35 అడుగులకు చేరింది. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే సుమారు 25 వేల కుటుంబాలను శిబిరాలకు తరలించారు. జూలై 17 నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో క్రమంగా బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. కానీ వరద విలయంతో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

పక్కా ఇళ్లు సైతం ముగినిపోవడంతో అందులో ఉన్న మంచాలు, బీరువాలు, ఫ్రిడ్జ్, వాషింగ్‌ మెíషీన్, టీవీలు, పరుపులు, బట్టలు ఇలా సమస్తం పనికి రాకుండా పోయాయి. చర్ల, దుమ్ము­గూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వా­పురం, మణుగూరు మండలాల్లో 17 వేలకు పైగా కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. కట్టుబట్టలతోనే మిగిలాయి. 

డబ్బులకు కటకట
వరదలు ముగిసినా వరుసగా వర్షాలు కురుస్తుం­డటంతో కూలీలకు పనులు దొరకడం లేదు. పాడైన ఇళ్లను మరమ్మతు చేయించుకునేందుకూ డబ్బుల్లేక చాలామంది అలాగే వదిలేస్తున్నారు. వరద సాయంగా ప్రభుత్వం అందించిన రేషన్‌ బియ్యం, పప్పు, నూనెలతోపాటు దాతలు ఇస్తున్న సరు­కులతోనే కుటుంబాలను నెట్టుకొç­Ü్తున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ముంపు ప్రాంత ప్రజలకు ఆకలి బాధలు తప్పేలా లేవు. 1986, 1991లో గోదావరికి భీకరంగా వరదలు వచ్చినా.. ఆ రోజుల్లో అభి­వృద్ధి, ప్రజల జీవనశైలి సాధారణమే కాబట్టి కట్టుబట్టలతో ప్రాణాలు నిలుపుకున్నా ఆస్తిన­ష్టం పెద్దగా లేదు. కానీ తాజా వరదలు ఇళ్లను, అందులోని సామగ్రిని నాశనం చేయ­డంతో భారీ ఎత్తున నష్టపోయారు. ఎప్పుడూ మోకాళ్లలోతు మించని వరద ఈసారి ఇంటి పైకప్పులను సైతం ముంచే స్థాయిలో రావడం, స్థానికులకు పీడకలగా మారింది. 

అందని సాయం 
వరదల్లో నష్టపోయిన వారికి తక్షణ సాయంగా సీఎం కేసీఆర్‌ రూ.10 వేల చొప్పున ప్రకటించారు. వరద తగ్గుముఖం పట్టగానే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి 17వేలకుపైగా కుటుంబాలను గుర్తించారు. వీరి ఖాతాల్లో ఇటీవల రూ.10 వేలు జమ అవుతున్నాయి. అయితే బా«ధితుల గుర్తింపు సందర్భంగా చేపట్టిన సర్వేలో జరిగిన తప్పులతో ఇప్పటికీ వేలాది మందికి సాయం అందలేదు. దీంతో బా«­దితులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. బ్యాంకుల విలీనం కారణంగా ఐఎఫ్‌ ఎస్‌సీ కోడ్‌ మారడంతో చాలామందికి ఆర్థిక సాయం అందలేదు. సత్వరమే చర్యలు తీసు కుని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


ఈయన కొక్కిరేణి సాంబశివరావు. బూర్గంపాడు నివాసి. కూలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతను నిల్చున్న చోట ఓ ఇల్లు ఉండేది. అందులో భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. జూలైలో వచ్చిన వరదలకు ఇల్లు నామరూపాల్లేకుండా పోవడంతో కుటుంబానికి గూడు కరువైంది. బంధువుల ఇళ్లలో భార్యాపిల్లలను ఉంచాడు. కూలిపోయిన ఇంటిని ఎలా నిర్మించుకో వాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.


ఈమె పేరు ముదిగొండ చంద్రమ్మ. గోదావరి వరదలు ఊరిని చుట్టేసిన సమయంలో ఆమె ఇల్లు నాలుగు రోజులపాటు వరద నీటిలో నానింది. ఇప్పుడు పనికిరాకుండా పోయింది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఇంట్లో ఉండలేక కూతురు వద్ద తలదాచుకుంటోంది. 1986, 1991లో వచ్చిన వాటి కన్నా మొన్న వచ్చిన వరదలే చాలా ప్రమాదకరంగా ఉన్నాయని అంటోంది.

డబ్బులు రాలేదు
వరదల సమయంలో మా ఇల్లు పూర్తిగా మునిగి పాడైపోయింది. రిపేరు చేయించుకుం­దామంటే డబ్బుల్లేవు. సర్వేలో అ«ధికారులు మా పేరు రాసుకున్నారు. కానీ ఇంకా డబ్బులు రాలేదు. నాలుగు రోజుల నుంచి తహసీల్దార్‌ ఆఫీసుకు వస్తున్నా. ఎవరూ సరైన వివరాలు చెప్పడం లేదు.
– రమణయ్య, భాస్కర్‌నగర్, బూర్గంపాడు మండలం

పని మానుకుని వచ్చా..
వరదలకు ఇల్లు కొట్టుకు­పోయింది. వర్షాలతో అసలు పనులే దొరకడం లేదు. రెండు రోజుల నుంచే కూలికి పోతు­న్నా. సీఎం ఇస్తానన్న రూ.ç­³ది వేలు మాకు రాలేదు. ఆ డబ్బు వస్తే కష్టకాలంలో కొంత ఆసరా ఉంటది. దాని కోసమే పని వదిలి తహసీల్దార్‌ ఆఫీసుకు వచ్చాను.      
–పేట్ల కుమారి, బూర్గంపాడు

మరిన్ని వార్తలు