ఇళ్లకే రామయ్య కల్యాణ తలంబ్రాలు 

12 Apr, 2022 03:44 IST|Sakshi

ఆర్టీసీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది బుకింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్శిల్‌ సర్వీసు విభాగం చేసిన ప్రయత్నానికి భారీస్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 88,704 మంది భక్తులు సీతారాముల కల్యాణ తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తొలి బుకింగ్‌ నమోదు చేసుకున్నారు. ఈ బుకింగ్‌ రూపంలో ఆర్టీసీకి మంచి ఆదాయమే లభించింది.

బుక్‌ చేసుకున్నవారు రూ.80 చెల్లించాలి. ఈ రూపేణా రూ.70,96,320 ఆదాయం సమకూరింది. ఇందులో దేవాలయవాటా కొంత ఉంటుంది. ఆదివారమే స్వామి అమ్మవార్ల కల్యాణం జరిగినందున, మంగళవారంనాటికి తలంబ్రాలతో కూడిన పొట్లాలు సంబంధిత జిల్లాలకు చేరతాయి. బుధవారం నుంచి భక్తులకు అందజేయనున్నారు. ‘సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలు బుక్‌ చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ నుంచి అత్యధికంగా 14,735 బుకింగ్స్‌ వచ్చాయి’ అని అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు