భైంసా అల్లర్లు: కీలక విషయాలు వెల్లడించిన ఐజీ

17 Mar, 2021 09:01 IST|Sakshi
నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి

అల్లర్లకు కారణం హిందూవాహిణీ కార్యకర్తలు

పోలీసులపై ఎవరి ఒత్తిడి లేదు..

కమిషనర్లతో పరిస్థితిని సమీక్షిస్తున్నాం

ఘటన పునరావృతమైతే సహించబోం..

భైంసా ప్రజలు సంయమనం పాటించాలి

చిన్నారిపై లైంగిక దాడి కేసులోనూ దర్యాప్తు

సాక్షి, హైదరాబాద్‌: భైంసాలో జరిగిన అల్లర్లలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని నార్త్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు. అల్లరకు ప్రధాన కారణం హిందూవాహిని కార్యకర్తలే అని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ‘ఈనెల 7వ తేదీన రాత్రి 8.20 గంటలకు గొడవ మొదలైంది.. అందులో ప్రధానంగా హిందూవాహినికి చెందిన తోట మహేశ్, దత్తు పటేల్‌ అనే ఇద్దరు బైకుపై వెళ్తూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న రిజ్వాన్‌ అతని మిత్రులు సమీర్, మిరాజ్‌లను వెనక నుంచి తలపై కొట్టారు. కోపంతో ఈ ముగ్గురు మహేశ్‌ను వెంబడిస్తూ బట్టీ గల్లీలోకి వెళ్లి వెదకడం ప్రారంభించారు’’ అన్నారు.

‘‘ఈ క్రమంలోనే ఆ ముగ్గురిపై దత్తు, మహేశ్‌.. రాకేశ్, గోకుల్‌తో కలసి దాడి చేశారు. అనంతరం ఆ ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత మద్యం కొనేందుకు దత్తు బైక్‌పై జుల్ఫికర్‌ మసీద్‌ ప్రాంతం నుంచి వెళ్లే క్రమంలో మరో వర్గం ఎదురుపడటంతో మళ్లీ ఘర్షణ మొదలైంది. ఆ సందర్భంగా రమణా యాదవ్‌ అనే వ్యక్తి కానిస్టేబుల్‌పై ఇటుకతో దాడి చేసి తల పగులగొట్టాడు. అక్కడ ఓ నిర్మాణం కోసం వచ్చిన ట్రక్కులో తెచ్చిన ఇటుకలున్నాయి. వీటిని ఆయుధాలుగా చేసుకుని రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ, సీఐ కేవలం గంటన్నర నుంచి రెండు గంటల్లోగా అల్లర్లను అదుపుచేశారు’’ అని తెలిపారు.

‘‘వీరితో పాటు ఎస్పీ విష్ణు వారియర్‌ అతని బలగాలు, ఇతర జిల్లాల నుంచి రామగుండం సీపీ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ, అడిషనల్‌ ఎస్పీలు తమ బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ అల్లర్లలో 15వ వార్డు కౌన్సిలర్‌ ఎంఐఎం పార్టీకి చెందిన అబ్దుల్‌ కరీం అతని అనుచరులు, హిందూవాహినికి చెందిన 8వ వార్డు కౌన్సిలర్‌ తోట విజయ్‌ వర్గీయులు పాల్గొన్నారు. ఏడో తేదీ తర్వాత 8, 9, 10వ తేదీల్లో పార్థి, మహాగావ్‌ భైంసా శివార్లలో జరిగిన అల్లర్లలో హిందూవాహినికి చెందిన సంతోష్, క్రాంతి, లింగోజీ, బాలాజీ, జగదీశ్‌ పాత్ర ఉన్నట్లు గుర్తించాం. సంతోష్‌కు హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు చెప్పడంతోనే హింసకు దిగారు. లింగోజీ అల్లర్లలో స్పెషలిస్ట్‌.. గత అల్లర్లలోనూ ఇతని పాత్ర ఉంది. ఇవీ.. ఈ మొత్తం వ్యవహారానికి దారితీసిన పరిస్థితులు. భైంసాలో 500 మంది పోలీసులతో ఎస్పీ వారియర్‌ ఆధ్వర్యంలో నిరంతర గస్తీతోపాటు 27 పికెట్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ భైంసాలో శాంతిని పునఃస్థాపించాం. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఎలాంటి ఘటన చోటుచేసుకోలేదు. సంతోష్‌ అతని అనుచరులను అరెస్టు చేయగానే.. అల్లర్లు మొత్తం ఆగిపోయాయి..’ అని వివరించారు. 

26 కేసులు..42 మంది అరెస్టు 
ఇక ఇద్దరు విలేకరులతో కలిపి మొత్తం 12 మంది పౌరులకు అల్లర్లలో గాయాలయ్యాయని నాగిరెడ్డి తెలిపారు. ‘13 షాపులు, 4 ఇళ్లు, 4 ఆటోలు, 6 ఫోర్‌వీలర్లు, 5 టూవీలర్లను దహనం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో భైంసాలోని సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్‌ కాల్స్‌ వివరాలు తదితర సాంకేతిక ఆధారాలతోపాటు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ఆధారంగా ఘటనకు సంబంధించి 26 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 38 మందితోపాటు నలుగురు మైనర్లను కలిపి మొత్తం 42 మందిని అరెస్టు చేశాం. అల్లర్ల సమయంలో రోడ్లపైకి వచ్చిన 70 మందిని గుర్తించాం. మరో 66 మందిని బైండోవర్‌ చేశాం. ఈ విషయాన్ని పోలీసు శాఖ చాలా తీవ్రంగా తీసుకుంది. అందుకే, శాంతి భద్రతల విషయాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ పర్యవేక్షిస్తుండగా, కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డికి అప్పగించాం.

ఇలాంటి ఘటనలు పునరావృతం చేయాలని చూసేవారిపై పీడీ కేసులు నమోదు చేస్తాం. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి. అల్లర్లలో పాల్గొన్న నిందితులు శిక్షలు పడేలా చూస్తాం. ఘటనతో సంబంధమున్న వారు ఏ పార్టీ, సంస్థకు చెందిన వారైనా సరే అరెస్టు చేస్తాం. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసుకుంటున్నాం.. అందుకే సీనియర్లను కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షించేలా ఏర్పాటు చేశాం. అల్లర్లు చెలరేగిన 5 నుంచి 10 నిమిషాల్లోపే అదనపు బలగాలు చేరుకుని అదుపు చేశాయి. భైంసాలో చిన్నారిపై జరిగిన లైంగిక దాడి విషయంలోనూ పోలీసు దర్యాప్తు సజావుగా సాగుతోంది. అయితే బాధితులు చిన్నారిని భైంసా ఆసు పత్రికి తీసుకెళ్తే.. వారిని వెనక్కి పంపారు. ఈ ఒక్క పొరపాటు తప్ప కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగలేదు..’అని వెల్లడించారు. 

ఆ ఐపీఎస్‌లపై హత్యాయత్నం కేసు పెట్టాలి: బండి సంజయ్‌
భైంసా అల్లర్లపై న్యాయ విచారణ చేపట్టాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌

కైలాస్‌నగర్‌(ఆదిలాబాద్‌): భైంసా అల్లర్ల విషయంలో రాష్ట్ర ప్ర భుత్వం, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి హిందూవాహిని కార్యకర్తలు, అమాయక హిందూ యువకులను అమానుషంగా హింసించిన ఐపీఎస్‌ అధికారులపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న హిందూవాహిని కార్యకర్తలను పరామర్శించేందుకు మంగళవారం అక్కడకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టి.. హిందూ పరిరక్షణ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను అరెస్టు చేసి దారుణంగా హింసించారని దుయ్యబట్టారు. హిందూవాహిని నేతలు సంతోష్, లింగోజి, క్రాంతి (18) అనే యువకుడిని ప్రొహిబిషన్‌లో ఉన్న పోలీసులతో కొట్టించారని ఆరోపించారు. దీన్ని వదిలిపెట్టే ప్ర సక్తే లేదని, న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హిందూ వ్యతిరేకులను పెంచి పోషిస్తున్నారని, బాలికపై అత్యాచారం జరిగినా çస్పందించని ఏకైక సీఎం ఆయనేనని విమర్శించా రు. భైంసా పట్టణాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కబంధహస్తల నుంచి కాపాడుకుంటామని స్పష్టం చేశారు. అల్లర్ల ఘటనపై ఏ ఒక్క రాజకీయ పార్టీ స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో హిందూవాహిని రాష్ట్ర అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌ తదితరులున్నారు. 

చదవండి:
భైంసాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అవస్థలు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు