భారత్‌ బంద్‌ ప్రశాంతం

27 Mar, 2021 03:16 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: అఖిల భారత కిసాన్‌ ఫెడరేషన్‌ (ఏఐకేఎఫ్‌) పిలుపు మేరకు శుక్రవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

అక్కడక్కడా రోడ్లపై బైఠాయించడమే కాకుండా, పలుచోట్ల దుకాణాలు మూసేయించారు. హన్మకొండలో పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్‌ సందర్భంగా పోలీసులు బస్టాండ్ల వద్ద బందోబస్తు చర్యలు చేపట్టారు. కరీంనగర్‌లో ఆందోళనలు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. మెదక్‌లోనూ రోడ్డుపై బైఠాయించిన వామపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు