రూపాంతరానికీ టీకాతో చెక్‌

30 Dec, 2020 10:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాలు రూపాంతరిత వైరస్‌పై కూడా సమర్థంగా పనిచేస్తాయని భారత్‌ బయోటెక్‌ సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కృష్ణా ఎల్లా స్పష్టం చేశారు. వైరస్‌ కొమ్ములోని పలు భాగాలను లక్ష్యంగా చేసుకోగల వ్యాక్సిన్లు ఉండటం.. ఇటు నిర్వీర్యం చేసిన వైరస్‌ ఆధారంగా తయారైన టీకాలో రెండు రకాల ప్రొటీన్లుండటం ఇందుకు కారణమని తెలిపారు. ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ మనోహర్‌ వీఎన్‌ శిరోద్కర్‌ స్మారకార్థం తెలంగాణ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఆన్‌లైన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌–అవర్‌ జర్నీ’ అంశంపై ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా.. ‘ప్రకృతిలో ఇప్పటికీ మనకు తెలియని వైరస్‌లు ఎన్నో ఉన్నాయి. మానవాళి మరింత జాగ్రత్త గా వ్యవహరించాలి’ అని అన్నారు. 1997లో ఓ స్టార్టప్‌ కంపెనీ మాదిరిగా వ్యాక్సిన్‌ తయారీ రంగంలో ప్రవేశించిన భారత్‌ బయోటెక్‌ పరిశోధనలతో ఒకప్పుడు రూ.800 ఉన్న హెపటైటిస్‌–బీ వ్యాక్సిన్‌ ధర ఇప్పుడు రూ.12కు చేరుకుంది. అనేక వ్యాధులకు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయం సాధించాం’ అని కృష్ణా ఎల్లా అన్నారు.(చదవండి: కొత్త వైరస్‌కూ పాత జాగ్రత్తలే )

మరిన్ని వార్తలు