‘దుష్ప్రభావాలు ఉంటే పరిహారం చెల్లిస్తాం’

16 Jan, 2021 17:00 IST|Sakshi

భారత్‌ బయోటెక్‌ ప్రకటన

హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని భారత్‌ బయోటెక్‌  ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌ కారణంగానే ప్రతికూలతలు ఎదురైనట్లు రుజువైతే.. వైద్య సహాయం కూడా అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్‌ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్‌ నష్ట పరిహారం చెల్లిస్తుంది’’ అని శనివారం నాటి ప్రకటనలో పేర్కొంది.  కాగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. (చదవండి: వ్యాక్సిన్‌: డాక్టర్‌ రెడ్డీస్‌కు డీసీజీఐ గ్రీన్‌ సిగ్నల్‌)

అంగీకార పత్రం తప్పనిసరి
ఇక దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల టీకా డోసులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు అందజేస్తున్నారు. కాగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వ్యాక్సిన్‌ వేయించుకునే వారి అంగీకార పత్రం ఉంటేనే తెలంగాణలో భారత్ బయోటెక్‌ టీకా అందజేస్తామని  ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆక్స్‌ఫర్డ్ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు మాత్రం ఎలాంటి అంగీకార పత్రం అవసరంలేదని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు