వంద శాతం ఆక్యుపెన్సీతో భారత్‌గౌరవ్‌ రైలు ప్రారంభం

19 Mar, 2023 03:29 IST|Sakshi

పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన

తక్కువఖర్చుతో ఎక్కువ ప్రాంతాల సందర్శనకు అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి భారత్‌ గౌరవ్‌ రైలు శనివారం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రారంభమైంది. ఎస్‌సీ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఐఆర్‌సీటీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రజనీ హసిజాతో కలిసి ‘పూరి– కాశీ– అయోధ్య‘పేరుతో నడిచే ఈ రైలును ప్రారంభించారు. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే ఈ రైలుకు మొదటిరోజే నగర పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.

వంద శాతం ఆక్యుపెన్సీతో బయలుదేరింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. కూచిపూడి నృత్యప్రదర్శన, డప్పు వాయిద్యాలు, ఇతర సాంస్కృతిక, కళారూపాలతో సాదరంగా ఆహా్వనించారు. జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ స్వాగత కిట్‌లను అందజేసి ప్రయాణికులతో ముచ్చటించారు.

జీఎం మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాలను సందర్శించేవిధంగా భారత్‌గౌరవ్‌ రైళ్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పర్యాటకుల అభిరుచి, పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలను రూపొందించినట్లు ఐఆర్‌సీటీసీ సీఎండీ రజనీ హసిజ తెలిపారు.  

పుణ్య క్షేత్రాల సందర్శన... 
‘పూరి– కాశీ– అయోధ్య‘పేరుతో ఐఆర్‌సీటీసీ ప్రవేశపెట్టిన ఈ పర్యాటక రైలులో ప్రయాణించేవారికి అన్ని రకాల సేవలను అందజేయనుంది. ఈ పర్యటనలో రైలు ప్రయాణంతోపాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం వంటి అన్ని ఏర్పాట్లు ఉంటా­యి.

8 రాత్రులు, 9 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని 9 ప్రధాన స్టేషన్లలో హాల్టింగ్‌ సదుపాయం ఉంది. రైలులోని మొత్తం 700 సీట్లు రిజర్వ్‌ అయినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్యాకేజీలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్‌ సూర్య దేవాలయం, గయా విష్ణుపాద ఆలయం, వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయం, అయోధ్య రామజన్మ భూమి, ప్రయాగ్‌ రాజ్, త్రివేణి సంగమం, తదితర ప్రాంతాలను ప్రయాణికులు సందర్శించనున్నారు. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు