పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..

9 Sep, 2020 03:34 IST|Sakshi

ప్రభుత్వ తీర్మానానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మద్దతు  

భట్టి విక్రమార్క ప్రసంగాన్ని త్వరగా ముగించాలన్న స్పీకర్

ప్రసంగం పూర్తి కాకుండానే కూర్చున్న సీఎల్పీ నేత 

పీవీతో పాటు తెలంగాణ వైతాళికులు మరుగున పడేయబడ్డారన్న మంత్రి కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొని తీర్మానాన్ని సమర్థించారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని కోరారు. ఈ తీర్మానంపై మాట్లాడిన వారిలో ఎవరేమన్నారంటే...!     

చబహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ: సీఎల్పీ నేత భట్టి 
‘తత్వవేత్తలే ఉత్తమ పాలకులని, వారి పాలనలోనే న్యాయం, ధర్మం సమపాళ్లలో ఉంటాయని ప్లేటో.. భావోద్వేగాలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కాకుండా అర్థం చేసుకుని పాలన చేసే వ్యక్తి గొప్ప నాయకుడు కాగలడని చాణక్యుడు చెప్పారు. ఈ రెండు లక్షణాలను పుణికి పుచ్చుకుని ఈ దేశాన్ని పాలించిన గొప్ప నేత పీవీ. ఆయన ఓ తత్వవేత్త, ఆర్థిక, అభ్యుదయ, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. సరళీకృత ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి ఈ దేశాన్ని కాపాడారు. అణుపరీక్షల కార్యక్రమాన్ని కూడా ఆయనే ప్రారంభించారు.’అని సీఎల్పీ నేత భట్టి పేర్కొన్నారు. అయితే, తన ప్రసంగం త్వరగా ముగించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేయడంతో భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. తానేమీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతిస్తున్నానని చెప్పారు. మరోసారి స్పీకర్‌ బెల్‌ కొట్టి ప్రసంగాన్ని ముగించాలనడంతో ఆయన కూర్చున్నారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. మళ్లీ భట్టి మాట్లాడుతూ.. పదేపదే తమను అవమానించేలా సభలో వ్యవహరించడం మంచిది కాదన్నారు. దీన్ని కేటీఆర్‌ వ్యతిరేకించారు. స్పీకర్‌నుద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, సభ్యుల బలాబలాలను బట్టి మాట్లాడే సమయం ఇస్తారన్నారు. భట్టి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తర్వాత భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వ తీర్మానానికి మద్దతు తెలుపుతున్నామని, పీవీకి భారతరత్న ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

అస్తిత్వాన్ని స్మరించుకోవడమే –  మంత్రి కేటీఆర్
తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని యావత్తు దేశం సమున్నతంగా గౌరవించేలా పీవీకి భారతరత్న ఇవ్వాలి. తెలంగాణ పోరాటం ఆస్తుల కోసం కాదు.. అస్తిత్వం కోసమని కేసీఆర్‌ చెప్పేవారు. ఒక్క పీవీనే కాదు.. అనేక మంది తెలంగాణ వైతాళికులు మరుగున పడేయబడ్డారు. మగ్దూం మొహినోద్దీన్, సంత్‌సేవాలాల్‌ మహరాజ్, ఈశ్వరీబాయి. భాగ్యరెడ్డి వర్మ, దాశరథి కృష్ణమాచార్యులు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, పైడి జయరాజు, సర్వాయి పాపన్నగౌడ్‌... ఇలా 25 మందికి పైగా యోధులను ప్రస్తుతం స్మరించుకుంటున్నాం. వీరిని స్మరణ అంటే తెలంగాణ సొంత అస్తిత్వాన్ని స్మరించుకోవడమే. పీవీ తెలంగాణ జాతి సామూహిక జ్ఞాన ప్రతీక. పట్వారి నుంచి ప్రధాని దాకా ఎదిగిన నేత. పల్లె నుంచి ఢిల్లీ దాకా విస్తరించిన చైతన్య పతాక పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలి. 

సముచిత గౌరవం ఇవ్వాలి – మంత్రి సత్యవతి రాథోడ్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలకు సముచిత గౌరవం ఇవ్వాలి. వారి స్ఫూర్తిని భావితరాలకు చాటాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడు ఆయన. దళిత, గిరిజన బిడ్డలు గురుకులాల్లో చదువుకుని ఎదుగుతున్నారనేందుకు ఆయనే కారణం.  
    
మద్దతిస్తున్నాం – రాజాసింగ్, బీజేపీ 
పీవీకి భారతరత్న కోరుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమర్థిస్తున్నా. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది.. కానీ సమయం చాలదు. నిజాం పాలనలోనే ఉస్మానియా గడ్డపై వందేమాతరం పాడినందుకు ఆయన బహిష్కరణకు గురయ్యారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మంచి నాయకుడిగా, దార్శనికుడిగా గుర్తింపు పొందారు.  
    
బీసీలకు మేలు చేశారు – గంగుల కమలాకర్, మంత్రి 
వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులు బాగా చదువుకోవాలనే ఆలోచన ఉన్న నేత పీవీ నరసింహారావు. నేను ఇంజనీరింగ్‌ చదివింది కూడా ఆయన చలువతోనే. ఆయన ప్రధాని అయిన తర్వాత కలిశాం. పీవీ కన్న కలలను కేసీఆర్‌ నిజం చేస్తున్నారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌ వెళ్లే రహదారికి ఆయన పేరు పెట్టాలి.  

మరిన్ని వార్తలు