‘బడ్జెట్‌’ను 35 రోజులు నిర్వహించాలి: భట్టి 

3 Feb, 2023 01:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను కనీసం 30 నుంచి 35 రోజుల పాటు నిర్వహించాలని సీఎల్పీనేత భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీఏసీ సమావేశంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఆయన అన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా తీసుకొని ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తామన్నారు.

తెలంగాణ ఏర్పాటై ఎనిమిది సంవత్సరాలు దాటినా యువతీ, యువకులు ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని, ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్‌ కోతలు, రైతుల రుణమాఫీ, పోడు భూముల సమస్య, ధరణి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు.

హాథ్‌సే హాథ్‌ జోడో యాత్ర గురించి ఈ నెల 4న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆధ్వర్యంలో సమావేశం జరుగనుందని, అందులో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పాదయాత్ర చేయాల్సిందిగా అధిష్టానం తనను ఆదేశిస్తే కచ్చితంగా రాష్ట్ర మొత్తం యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నానని భట్టి పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు