దగా చేస్తున్న కేసీఆర్‌: భట్టివిక్రమార్క

3 Sep, 2020 13:55 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క

సాక్షి, జనగామ: తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగా, మోసం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిని గురువారం ఆయన సీఎల్సీ బృందంతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..  ఏడాదికి లక్షా 80 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను పేదలకు కేటాయించామనే చెప్పే కేసీఆర్‌ వారికి పనికి వచ్చే ఆసుపత్రులకు ఎంత కేటాయించారని ప్రశ్నించారు. ఈ ఆరున్నర ఏళ్లలో కొత్తగా ఒక్క ఆసుపత్రి అయినా కేసీఆర్ ప్రభుత్వం కట్టిందా అని ధ్వజమెత్తారు. పేదలకు ఉపయోగపడే ఇటువంటి ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోవడం.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇన్నిన్ని ఖాళీలు ఉంటే ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కేసీఆర్‌ దగా చేస్తున్నారని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిని నాలుగేండ్ల కింద ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇప్పటి వరకూ జిల్లా కేంద్ర ఆసుపత్రికి ఉండాల్సిన ఏ వసతులు లేవని ఆరోపించారు. ఇది జిల్లా కేంద్ర ఆసుపత్రి అనే ఆ విషయాన్నే కేసీఆర్‌ మరిచిపోయారా? అసలు ఈ ప్రభుత్వానికి గుర్తుందా అని మండిపడ్డారు. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 2200 కరోనా కేసులు వస్తే.. అందులో 1900 రోగులను హోమ్ క్వారంటైన్‌కు పంపారన్నారు. అసలు బుద్ధి ఉన్నవారేవరైన అలా పంపుతారా అని భట్టి విక్రమార్క విమర్శించారు. ఇక్కడ డాక్టర్లు లేరు.. ఉన్న ఒకరో, ఇద్దరి మీదో మోయలేని భారం పడుతోందని చెప్పారు. ఈ కరోనా మరణాలకు సీఎం కేసీఆర్‌యే బాధ్యత వహించాలన్నారు. కరోనా రాష్ట్రంలోకి రానేరాదు.. వైరస్ పేలిపోతుంది.. అని జోకర్‌లా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని విమర్శించారు. జనగామ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 14 మంది ఉండాల్సి ఉండగా 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

డిప్యూటీ సివిల్ సర్జన్స్ పోస్టులు 10 ఉంటే 9 ఖాళీలు ఉండగా.. సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టులు 7 ఖాళీలు ఉన్నాయని ఆయన తెలిపారు. డెంటల్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2, ఫార్మసీస్ట్ పోస్తులు 4 ఉంటే మూడు ఖాళీగా ఉన్నాయన్నారు. మొత్తంగా జనగామ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 32 ఖాళీలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘ఉద్యమంతా ఉద్యోగాల కోసమే అన్న రాజేందర్‌ నీ మాటలు ఎవరయ్యా నమ్మేది.. ఇతర శాఖల్లో ఖాళీల సంగతి పక్కన పెడితే ఒక్క నీ శాఖలోని వేల ఖాళీలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కటైన ఈ ఆరున్నర ఏళ్లలో భర్తీ చేశారా’ అని ప్రశ్నించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు