మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై పాదయాత్ర చేయండి 

15 Apr, 2022 03:21 IST|Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  

బోనకల్‌: ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తే బాగుంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సూచించారు. దేశంలో అన్ని మతాలు, కులాలకు సమానత్వం కల్పించేలా రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ జయంతి రోజున మొదలుపెట్టిన పాదయాత్ర ఎవరికోసమో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి చేపట్టిన ‘పీపుల్స్‌ మార్చ్‌’పాదయాత్ర గురువారం బోనకల్‌ మండలంలో కొనసాగింది.

ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. ఫెడరల్‌ స్పూర్తికి విరుద్ధంగా దళిత, గిరిజన, బలహీనవర్గాలు మరింత వెనుకబడేలా మనువాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తపనతోనే సంజయ్‌ సంగ్రామ యాత్ర చేపట్టారని విమర్శించారు. ఈ విషయంలో లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు అప్రమత్తంగా ఉండాలని భట్టి కోరారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చమురు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపిందని, సంపన్నులకు మాత్రం రూ.11లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేసిందని ఆరోపించారు. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. ఇన్నేళ్లలో ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు