అంకెల రంకెలే...

16 Mar, 2022 01:48 IST|Sakshi

వాస్తవానికి దూరంగా రాష్ట్ర బడ్జెట్‌ 

అంచనాకు వాస్తవానికి మధ్య వ్యత్యాసం 60వేల కోట్లు 

బడ్జెట్‌పై భట్టి విక్రమార్క విమర్శలు 

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్‌ వాస్తవాలకు దూరంగా ఉందని, పెద్ద పద్దు కనిపించడం కోసం భారీ బడ్జెట్‌ను రూపొందించారని.. అంకెలు, వాస్తవ లెక్కలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతోందని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గత బడ్జెట్‌ అంకెలు, వాస్తవంగా సమకూరిన ఆదాయాన్ని బేరీజు వేసుకుని పరిశీలిస్తే.. తాజా బడ్జెట్‌ అంచనాలు–వాస్తవానికి మధ్య రూ.60 వేల కోట్ల వరకు వ్యత్యాసం ఉండనుందని చెప్పారు.

అంతమేర సంక్షేమంపై ఖర్చులు తగ్గిపోనున్నట్టే కదా అని ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ..అప్పులను మూలధన పెట్టుబడిగా మార్చుకోకుంటే అవి భవిష్యత్తులో రాష్ట్రానికి పెనుభారంగా మారతాయని చెప్పారు. అప్పుల్లో 90% మొత్తాన్ని మూలధన పెట్టుబడిగానే ఖర్చు చేస్తున్నట్టు మంత్రి హరీశ్‌రావు చెబుతున్న మాటలకు, బడ్జెట్‌లో అంకెలకు పొంతనే ఉండటం లేదన్నారు. 

ఆ పథకాలు కూడా కొనసాగించండి: రైతుబంధుతోపాటు గతంలో రైతులకు అమలు చేసిన వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను అందించే పథకాలను కూడా కొనసాగించాలని భట్టి కోరారు. పోడు భూములను పంపిణీ చేయాలని, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, 171 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని  విమర్శించారు. మహాత్ముడిని మట్టుబెట్టిన వారే దేశాన్ని పాలిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సీఎం పూర్తి ఆరోగ్యంతో ఉండాలని సీఎల్పీ తరఫున కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.  

సర్కారీ అప్పు ప్రజలకు ముప్పు 
ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల మున్ముందు ప్రజలపై పెనుభారం పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారె డ్డితో కలసి భట్టి మాట్లాడారు. శాసనసభలో ప్రజాసమస్యలపై గళం వినిపించే ప్రతిపక్షాల గొంతు నొక్కారని, చర్చ జరగకుండా సమయం తక్కువగా ఇచ్చారని ధ్వజమెత్తారు.  

కౌరవ సభను తలపిస్తోంది 
అసెంబ్లీ సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు కౌరవసభను తలపిస్తోందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతున్నప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్‌ అని సంభోధించి అవహేళన చేశారని  మండిపడ్డారు. ఇది సభను పక్కదారి పట్టించడమేనని సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క ఆరోపించారు.  

మరిన్ని వార్తలు